టెక్‌ దిగ్గజాల ఆధిపత్యాన్ని సవాలు చేస్తోన్న భారత్‌, అమెరికా, ఈయూ

టెక్నాలజీ దిగ్గజ కంపెనీలుగా పేరొందిన గూగుల్‌ (Alphabet), మెటా (Facebook) వంటి సంస్థలకు ప్రపంచ దేశాలను సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి

Updated : 21 Nov 2022 15:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్నాలజీ దిగ్గజ కంపెనీలుగా పేరొందిన గూగుల్‌ (Alphabet), మెటా (Facebook) వంటి సంస్థలకు పలు దేశాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గుత్తాధిపత్యం నిరోధం కింద గూగుల్‌కు యూరోపియన్ యూనియన్‌లో ఇటీవల 4.1బిలియన్‌ డాలర్ల భారీ జరిమానా పడగా.. గూగుల్‌, మెటా సంస్థలకు దక్షిణ కొరియాలోనూ 71 మిలియన్‌ డాలర్ల జరిమానా పడింది. ముఖ్యంగా గూగుల్‌.. ఆండ్రాయిడ్‌ తయారీ దారులపై ఆంక్షలు విధిస్తూ, తన సొంత సెర్చ్‌ ఇంజిన్‌కు ప్రయోజనం చేకూర్చేలా వ్యూహాలు అమలు చేస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. వీటితోపాటు యూజర్‌ డేటాను సేకరించడం, వాటిని అధ్యయనం చేయడం, వెబ్‌సైట్‌ల వినియోగాన్ని ట్రాక్‌ చేయడం వంటి ప్రధాన ఆరోపణలు ఆ సంస్థపై ఉన్నాయి.

ఇలా వివిధ రకాలుగా గుత్తాధిపత్యానికి పాల్పడుతోన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. టెక్‌ దిగ్గజాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఒక్కో దేశంలో గూగుల్‌కు ఎదురవుతోన్న వరుస ఓటముల నేపథ్యంలో కుకీల నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీలు భారత్‌లో కూడా ఆధిపత్యం చలాయిస్తున్నాయా.. అనే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

జవాబుదారీతనం లేని విధంగా ప్రవర్తించేందుకు ఈ టెక్‌ దిగ్గజాలకు అనుకూలంగా ఏమైనా మార్గాలు ఉన్నాయా అని గుర్తించేందుకు ఇప్పటికే కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI), కేంద్ర కమ్యూనికేషన్‌, ఐటీశాఖలు దర్యాప్తు చేపట్టాయి. ఈ క్రమంలోనే గూగుల్‌తోపాటు ఆ సంస్థ ఇతర వేదికల యాడ్‌లపై సహేతుకమైన మొత్తాన్ని ఇవ్వాలని డీఎన్‌పీఏ (డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై సీసీఐ విచారిస్తోంది. గూగుల్‌ వంటి టెక్‌దిగ్గజాల యాడ్‌ల ఆదాయంలో మరింత పారదర్శకత తేవడంలో భాగంగా దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు, స్థానిక న్యూస్‌ ప్రొవైడర్లు కలిసి బీఎన్‌పీఏ వేదికగా పోరాటానికి సిద్ధమయ్యాయి.

టెక్‌ దిగ్గజాల నుంచి ఎదురవుతోన్న సవాళ్లపై పార్లమెంటరీ కమిటీ కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతోంది. భారత పౌరుల గోప్యతతోపాటు వారి ప్రయోజనలను దృష్టిలో పెట్టుకొని టెక్‌ దిగ్గజాలతోపాటు సామాజిక మాధ్యమ సంస్థలు కచ్చితంగా ఇక్కడి నిబంధనలు పాటిస్తూ మరింత జవాబుదారీగా ఉండాల్సిందేనని కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కూడా స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా డిజిటల్‌ మీడియాను దృష్టిలో పెట్టుకొని ఇదివరకు ఉన్న ఐటీ చట్టం స్థానంలో ‘డిజిటల్‌ ఇండియా యాక్ట్‌’ను తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్‌ వినియోగదారులు, టిక్‌దిగ్గజాల మధ్య సంబంధాన్ని మరింత పారదర్శకతంగా ఉంచేందుకు ఉద్దేశించిన నిబంధనలు ఇందులో ఉండనున్నట్లు సమాచారం.

అమెరికాలోనూ చర్యలు..

అమెరికాలోనూ గూగుల్‌ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ దిశగా ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గూగుల్‌ సహా ఇతర టెక్‌ దిగ్గజాల అధికారాలను గణనీయంగా కుదించే ప్రతిపాదిత బిల్లు కోసం 13 కంపెనీలను యూఎస్‌ కాంగ్రెస్‌ పిలిచింది. దీంతో పాటు గూగుల్‌ గుత్తాధిపత్య ప్రవర్తనపై యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌.. ఫెడరల్‌ జడ్జికి ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై విచారణ జరిగి గూగుల్‌ దోషిగా తేలితే.. పెద్ద టెలికాం కంపెనీలు భారీగా ఆదాయాన్ని కోల్పోయే అవకాశముంది. ఎందుకంటే గూగుల్‌ తన సెర్చ్‌ ఇంజిన్‌ ఆధిపత్యాన్ని  కొనసాగించడానికి శాంసంగ్‌, ఆపిల్‌, ఇతర టెలికాం దిగ్గజాలకు బిలియన్ల కొద్దీ చెల్లిస్తోన్నట్లు ఇటీవల అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.

ప్రపంచవ్యాప్తంగా యాంటీ ట్రస్టు సమస్యలపై కొనసాగుతున్న వివిధ చర్యల తరహాలో శ్వేతసౌధం కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. బిగ్‌ టెక్‌ కంపెనీలను సంస్కరించే లక్ష్యంతో ఆరు సూత్రాలను రూపొందించింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అధికార యంత్రాంగం రూపొందించిన ఈ సూత్రాలలో.. సీడీఏలోని సెక్షన్‌ 230 కింద సోషల్‌ మీడియా సంస్థలు పొందే ప్రత్యేక రక్షణ, ఇతర మినహాయింపులను తొలగించడం ఒకటి. 

త్వరలో పటిష్ఠమైన డేటా రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని ఇటీవల భారత ప్రభుత్వం పదేపదే చెబుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా సంస్థలకు చట్టపరమైన రక్షణను తొలగించడానికి అమెరికా ఈ చర్యలకు సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు