దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: ఏపీ డీజీపీ

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్ద జరిగిన దాడి ఘటన దురదృష్టకరమని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు.  దేశమంతటా పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో ఇలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడటం

Updated : 27 Mar 2020 08:54 IST

అమరావతి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్ద జరిగిన దాడి ఘటన దురదృష్టకరమని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు.  దేశమంతటా పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో ఇలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడటం గర్హనీయమన్నారు. పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. 

‘‘ దేశం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో బాధ్యతాయుత పౌరుడిగా వ్యవహరించడం మన కర్తవ్యం. ఈ విషయాన్ని మరిచి దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమో మీరే నిర్ణయించుకోండి. మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రొటోకాల్‌ ప్రకారం.. తన కోసం, తన కుటుంబ సభ్యుల కోసం, దేశ పౌరుల కోసం స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రాల మధ్య సరిహద్దులు మూసివేశాం. జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాలకు గ్రామాలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాయి. ఈ తరుణంలో అన్ని జిల్లాల సరిహద్దులను ఛేదించుకొని, చట్టాలను ఉల్లంఘించి బైక్‌లు, కార్లు, బస్సులలో వచ్చి ప్రోటోకాల్‌ను ధిక్కరించి పొందుగుల సరిహద్దు వద్దకు చొచ్చుకొచ్చారు. అయినా మానవతా దృక్పథంతో రెండు ప్రభుత్వాలు చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రొటోకాల్‌ ప్రకారం వారి ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలోకి అనుమతించే విధంగా రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా వారికోసం బస్సులు సమకూర్చాం. క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇవేమీ పట్టించుకోకుండా సరిహద్దులు దాటడానికి ప్రయత్నించారు.  చీకటిపడిన తర్వాత పోలీసులపైకి మూకుమ్మడి దాడులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇరు ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా హామీ ఇవ్వడం జరిగింది.’’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వివరించారు.
ఇదీ చదవండి: సరిహద్దుల్లో ఉద్రిక్తత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని