ఎన్నెన్నో పుష్పాలు.. అన్నింటా అందాలు

ప్రకృతి ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు, సోయగాలకు నిలయం. పుడమిపై పచ్చదనాన్ని ఆస్వాదించాలంటే ఒక్కోసారి రెండు కళ్లు చాలవు. ఎత్తైన కొండలు, కొండల నుంచి జాలువారే జలపాతాలు, పక్షుల కిలకిలరావాలు, ఆకాశానికి

Published : 31 May 2020 23:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రకృతి ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు, సోయగాలకు నిలయం. పుడమిపై పచ్చదనాన్ని ఆస్వాదించాలంటే ఒక్కోసారి రెండు కళ్లు చాలవు. ఎత్తైన కొండలు, కొండల నుంచి జాలువారే జలపాతాలు, పక్షుల కిలకిలరావాలు, ఆకాశానికి రంగులేసినట్టు ఏర్పడే ఇంద్రధనస్సు.. ఇలా ఒక్కటేమిటి ప్రకృతిలో అందాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలో పుష్పాలు ఒకటి. ప్రపంచంలో కొన్ని చోట్ల ముఖ్యంగా ఈ పుష్పాలు నేలతల్లి సిగలో కొలువుదీరి ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరి అలాంటి ప్రదేశాల గురించి తెలుసుకోండి మరి..

స్కగిట్ లోయలో..

మనకు అరకు లోయలో కాఫీ తోటలు, కశ్మీర్‌ లోయలో యాపిల్‌ తోటలు, మంచు పర్వతాలు ఎంతగా ఆకట్టుకుంటున్నాయో తెలుసు. అయితే అమెరికాలోని వాషింగ్టన్‌ నగరానికి చేరువలో ఉన్న ఓ లోయ (వ్యాలీ) మాత్రం రంగురంగుల పువ్వులతో చూపరులను కనువిందు చేస్తోంది. అదే స్కగిట్‌ వ్యాలీ. ఎక్కువ విస్తీర్ణంలో ఇక్కడ తులిప్‌ పువ్వులను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వేసవికాలం వీటిని చూడడానికి అనుకూల సమయం. సుదూరాన పర్వత శిఖరాలు, నింగి నేలా కలిసిందా అన్నట్టు భ్రమింపజేసే ప్రకృతి అందాలు ఈ స్కగిట్‌ వ్యాలీ సొంతం.

చైనాలో ఎర్రటి తీరం

పుడమికి  పువ్వులు ఎర్రటి రంగు అద్దితే ఎలా ఉంటుంది. అలాంటి దృశ్యమే చైనాలో ఆవిష్కృతమైంది. చైనాలోని సముద్ర తీరప్రాంతంలోని పాన్‌జిన్‌ అనే ప్రదేశంలో ఎరుపు వర్ణంలో పూలు భూమిని కప్పేశాయి. అందుకే ఈ ప్రదేశానికి ఎర్రటి తీరం అనే పేరొచ్చింది. ఈ సుందర ప్రదేశాన్ని చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మే నుంచి అక్టోబరు వరకు పర్యాటకులు ఈ ప్రదేశాన్ని చూసే అవకాశం ఉంది.

సియోల్‌లో పూల తోరణాలు
సాధారణంగా మనం శుభ కార్యాలకు, ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు పూలతో అలకంరించిన స్వాగత తోరణాలు చూస్తుంటాం. అదే మాదిరిగా పువ్వులతో నిండిన వృక్షాలే స్వాగత తోరణాలలా మనల్ని మైమరిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ప్రదేశమే దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ ఉంది. రోడ్డుకు ఇరువైపులా స్వాగతా తోరణంలా అల్లుకున్న వృక్షాలు.. వాటికి గులాబీ రంగులో పూసిన పువ్వులు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. దారి పొడువునా గులాబీ వర్ణంతో నిండి మనసును దోచేస్తాయి. ముఖ్యంగా మార్చి నుంచి మే నెలలో ఈ పుష్పాలు విరబూస్తాయి.

దక్షిణాఫ్రికాలో పరుచుకున్న అందాలు

రకరకాల పువ్వులు ఒకే విశాల ప్రదేశంలో కనువిందు చేస్తే ఎలా ఉంటుంది. దక్షిణాఫ్రికాలోని నమక్యూలాండ్ అనే ప్రాంతం సారవంతమైన భూమి. ఇక్కడ అనేక పూల మొక్కలు వాటి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా తెలుపు, కాషాయం‌, పసుపు, ఎరుపు వంటి వర్ణాల్లో రకరకాల పువ్వుల అందాలు ఈ ప్రదేశంలో పరుచుకున్నాయి. ముఖ్యంగా ఆగస్టు నెలలో నమక్యూలాండ్ పుష్పాల అందాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ మైమరిచి పోవాలంటే ఈ ప్రదేశాన్ని చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని