Bhadrachalam: భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం.. సాయంత్రం నుంచి రాకపోకలు బంద్‌!

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. గురువారం మధ్యాహ్నానికి నదిలో నీటిమట్టం

Updated : 14 Jul 2022 13:19 IST

భద్రాచలం: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. గురువారం మధ్యాహ్నానికి నదిలో నీటిమట్టం 60.30 అడుగులకు చేరుకోవడంతో సమీపంలోని లోతట్టు కాలనీలను వరద ముంచెత్తింది. సుభాష్‌నగర్‌, రామాలయం పరిసరాలు, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ వంటి ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి భారీ స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో గురువారం రాత్రికి భద్రాచలంలో వరద తీవ్రత మరింత ఎక్కువ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

పునరావాస కేంద్రాలకు 5 వేల మంది తరలింపు

గోదావరి నీటి మట్టం 66 నుంచి 70 అడుగులకు చేరుతుందనే అంచనాతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, మణుగూరు, బూర్గంపహాడ్‌, అశ్వాపురం, కరకగూడెం మండలాల్లో దాదాపు 5 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ భద్రాచలంలోనే మకాంవేసి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

కూనవరం, చర్ల మార్గాల్లో నిలిచిన రవాణా

గోదావరికి వరద ప్రభావం ఎక్కువైన నేపథ్యంలో ఇప్పటికే భద్రాచలం నుంచి కూనవరం, చర్ల వెళ్లే మార్గాల్లో రవాణా నిలిచిపోయింది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి భద్రాచలం గోదావరి వంతెనపై రాకపోకలను నిలిపేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో భద్రాచలం నుంచి హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై రవాణా నిలిచిపోవడంతోపాటు మన్యం ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని