Andhra News: పరిశ్రమను తరలించండి.. పోరస్‌ ఎదుట స్థానికుల ఆందోళన

ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమ ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో గాలి, నీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 14 Apr 2022 10:56 IST

అక్కిరెడ్డిగూడెం: ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమ ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో గాలి, నీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నామని ఆరోపించారు. పంటలు కూడా సరిగా పండట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిశ్రమను గ్రామం నుంచి తరలించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలను వేసి రాకపోకలను అడ్డుకున్నారు. ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని పరిశ్రమ సిబ్బంది, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు గ్రామస్థులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 

నిన్న (బుధవారం) అర్ధరాత్రి సమయంలో రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో ఆరుగురు మృతిచెందారు. అందులో ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనమైనట్లు సమాచారం. మరో 13 మంది తీవ్రంగా గాయపడగా వారిని విజయవాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఏపీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని