Raghunandan rao: పోలీసుల దాష్టీకానికి గురైన మహిళను పరామర్శించిన రఘునందన్‌

పోలీసుల దాష్టీకానికి గురైన వరలక్ష్మి అనే మహిళను భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరామర్శించారు. ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated : 19 Aug 2023 15:10 IST

హైదరాబాద్‌: ఇటీవల ఎల్బీనగర్‌ పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడిన గిరిజన మహిళ వరలక్ష్మిని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరామర్శించారు. బాధితురాలు చికిత్స పొందుతున్న కర్మన్‌ఘాట్‌లోని జీవన్ ఆస్పత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ప్రతి చిన్న విషయంపైనా ట్విటర్‌లో స్పందించే మంత్రి కేటీఆర్‌ ఇప్పుడెందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. మహిళలకు అండగా నేనున్నానని చెప్పే ఎమ్మెల్సీ కవిత ఎందుకు స్పందించలేదన్నారు.

బాధితులకు అండగా భాజపా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసి ఊరుకుంటే సహించేది లేదని, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ స్థాయి అధికారిని కూడా సస్పెండ్‌ చేయాలన్నారు. తమ వంతు సాయంగా కొంత నగదును అందించారు. పలువురు పార్టీ నేతలు కూడా రఘునందన్‌రావుతో కలిసి బాధితురాలిని పరామర్శించారు.

తెలంగాణలో 3 రోజులపాటు ఉరుములు మెరుపులతో వర్షాలు

స్వాతంత్య్ర దినోత్సవం నాడు అర్ధరాత్రి వేళ వరలక్ష్మిపై ఇద్దరు పోలీసులు దాష్టీకానికి దిగిన సంగతి తెలిసిందే. రాత్రి 11 గంటల తర్వాత ఠాణాకు తీసుకురావడంతో పాటు, లాఠీలతో దారుణంగా కొట్టారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆగస్టు 15 రాత్రి చోటుచేసుకున్న ఈ దారుణం గురించి బాధితురాలు చెప్పడంతో గురువారం వెలుగులోకొచ్చింది. దాడికి పాల్పడ్డ హెడ్‌ కానిస్టేబుల్‌ శివశంకర్‌, మహిళా కానిస్టేబుల్‌ సుమలతను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సైతం శుక్రవారం స్పందించారు. ఘటనపై 48 గంటల్లోగా నివేదిక అందించాలని సీఎస్‌, డీజీపీ, రాచకొండ కమిషనరేట్‌ సీపీలను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని