Bhadrachalam: గోదావరి ఉద్ధృతి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Published : 26 Jul 2023 22:30 IST

భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద బుధవారం రాత్రి 9.28 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు.

వచ్చే 48 గంటల్లో అతి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎస్‌ శాంతికుమారి

వర్షాలు, వరదలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రభుత్వ సిబ్బంది పనిచేసే కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితులు, గోదావరి వరద పరిస్థితిపై భద్రాచలం ఆర్డీవో కార్యాలయం నుంచి రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, రహదారులు భవనాలశాఖ, మిషన్‌ భగీరథ, విద్యుత్‌, వైద్య, సెక్టోరియల్‌, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  వాతావరణ శాఖ సూచన మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరెంజ్‌ అలెర్ట్‌ జోన్‌లో ఉన్నట్టు చెప్పారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు అప్రమత్తంగా చెప్పారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ములకపల్లిలో జరిగిన ఘటన చాలా దుదృష్టకరమని, అలాంటి ప్రాంతాల్లో ప్రయాణాలు చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని