గంగుల ఎన్నిక వివాదం.. బండి సంజయ్‌ క్రాస్ ఎగ్జామినేషన్‌కు హైకోర్టు అనుమతి

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Published : 31 Jul 2023 22:24 IST

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆగస్టు 12 నుంచి 17వ తేదీ వరకు బండి సంజయ్‌ని విచారించి నివేదిక సమర్పించాలని కోర్టు కమిషనర్‌గా నియమితులైన మాజీ జిల్లా జడ్జి కె.శైలజను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్‌ ఎన్నిక చెల్లదంటూ 2019లో బండి సంజయ్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది.

గంగుల కమలాకర్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని బండి సంజయ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల అడ్వొకేట్ కమిషన్ ఎదుట బండి సంజయ్ హాజరై వాంగ్మూలమిచ్చారు. అయితే సంజయ్‌ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అనుమతివ్వాలని గంగుల తరఫు న్యాయవాది కోరడంతో హైకోర్టు అంగీకరించింది. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున క్రాస్ ఎగ్జామినేషన్‌కు సమయం ఇవ్వాలని బండి సంజయ్ కోరడంతో ఆగస్టు 12 నుంచి 17 వరకు విచారణకు హాజరవ్వాలని ఆదేశించిన ధర్మాసనం.. పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని