Praneeth Rao case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. నేరం అంగీకరించిన నిందితులు!

ప్రైవేటు వ్యక్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో చంచల్‌ గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని అంగీకరించినట్లు తెలుస్తోంది.

Updated : 25 Mar 2024 17:38 IST

హైదరాబాద్‌: ప్రైవేటు వ్యక్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు మంగళవారం కస్టడీ పిటిషన్‌ వేయనున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతోపాటు, ప్రధాన నిందితుడు ప్రణీత్‌రావును కస్టడీకి కోరనున్నారు. ఆ ముగ్గుర్నీ కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు చంచల్‌ గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్లు సమాచారం. వారిచ్చిన సమాచారం మేరకు నాగోలు మూసీ వంతెన కింద హార్డ్‌డిస్క్‌ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. మరోవైపు విచారణ సమయంలో ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావు, రాధాకిషన్‌ పేర్లను నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. వారిని కూడా విచారించాల్సి ఉన్నందున వారిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. 

తొలుత ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టయిన ప్రణీత్‌రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదంతా అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్‌రావు వాంగ్మూలంలో వెల్లడించాడు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించారు. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో, తిరుపతన్న ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఐన్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు అరువెల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని