Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 20 Oct 2021 13:13 IST

1.మాపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోంది: జగన్‌

అమరావతి: వైకాపా సర్కార్‌పై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని.. అందుకే దారుణమైన పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ‘జగనన్న తోడు’ వడ్డీ చెల్లింపు కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణమాలపై స్పందించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అలా మాట్లాడలేదన్నారు. టీవీల్లో బూతులు విని భరించలేని అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. కులాలు, మతాల మధ్య విపక్షం చిచ్చు పెడుతోందన్నారు.

లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి..

2.  కుషీనగర్‌ ఎయిర్‌పోర్టును ప్రారంభించిన మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని మూడో అంతర్జాతీయ విమానాశ్రయమైన కుషీనగర్‌ ఎయిర్‌పోర్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, యూపీ గవర్నర్‌ ఆనందిబెన్ పటేల్‌, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. శ్రీలంక నుంచి 120 మంది బౌద్ధ సాధువులు, ప్రముఖులతో కూడిన తొలి విమానం ఈ ఎయిర్‌పోర్టుకు నేడు చేరుకోనుంది.

3. ఓ కొత్త నటితో ఆర్యన్‌ ‘డ్రగ్స్‌ చాట్‌’.. కోర్టుకు సమర్పించిన ఎన్‌సీబీ 

ముంబయి క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో బాలీవుడ్‌ స్టార్‌  షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు ఇంకా ఊరట లభించలేదు. ప్రస్తుతం అతడు ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉండగా.. ఆర్యన్‌ బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. ఇదిలా ఉండగా.. ఓ బాలీవుడ్‌ నటితో ఆర్యన్‌ డ్రగ్స్‌ గురించి చాటింగ్‌ చేసినట్లు ఎన్‌సీబీ దర్యాప్తులో గుర్తించింది. అందుకు సంబంధించిన ఆధారాలను నేడు కోర్టుకు సమర్పించింది.

4. క్లోజ్‌ఫ్రెండ్‌తో సామ్‌.. దేహ్రాదూన్‌ టూర్‌
‘శాకుంతలం’ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల అగ్రకథానాయిక సమంత సినిమాల నుంచి కొంత బ్రేక్‌ తీసుకున్న విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో నాగచైతన్యతో వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పిన అనంతరం సామ్‌ సినిమాల్లో నటిస్తుందా? లేదా? అని అందరూ సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన కెరీర్‌పై నెటిజన్ల నుంచి వస్తోన్న ప్రశ్నలకు సమాధానమిస్తూ విజయదశమి రోజున తాను చేయనున్న తదుపరి ప్రాజెక్ట్‌లను ఆమె ప్రకటించారు.

5. తెదేపాను నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతాం: బొత్స
తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమాధానం ఏంటని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నిన్న ఏపీలోని తెదేపా కార్యాలయాలపై దాడులు జరగడం.. ఇవాళ ఆ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చి నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.

రాజకీయ ఉనికి కోసమే రెచ్చగొడుతున్నారు: శ్రీకాంత్‌రెడ్డి

6. స్థిరాస్తి, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టారా?
ఒక ఆస్తిని కొనుగోలు చేసిన‌ప్పుడు చెల్లించిన ధ‌ర కంటే.. ఎక్కువ ధ‌ర‌కు అమ్మితే వ‌చ్చిన లాభాన్ని మూల‌ధ‌న రాబ‌డి అంటారు. ఆస్తి మన దగ్గర ఉన్న వ్యవధిని బట్టి దీన్ని స్వల్పకాలిక మూలధన రాబడి, దీర్ఘకాలిక మూలధన రాబడి.. అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. దీన్ని బట్టే వీటిపై పన్ను ఉంటుంది. అయితే, కొన్ని ఆస్తులు క్యాపిటల్‌ గెయిన్స్‌ పరిధిలోకి రావు.

7. ఫేస్‌బుక్‌ పేరు మారనుందా..?

సామాజిక మాధ్యమ వేదికల్లో దిగ్గజ కంపెనీగా పేరొందిన ఫేస్‌బుక్‌.. త్వరలోనే తన పేరును మార్చుకోనుందట. ఈ కంపెనీని కొత్త పేరుతో రీబ్రాండ్‌ చేయాలని ఫేస్‌బుక్‌ యాజమాన్యం యోచిస్తున్నట్లు ప్రముఖ టెక్‌ పత్రిక ‘ది వెర్జ్‌’ ఓ కథనంలో వెల్లడించింది. అక్టోబరు 28న జరిగే కంపెనీ వార్షిక సదస్సులో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేరు మార్పు గురించి మాట్లాడే యోచనలో ఉన్నట్లు తెలిపింది.

8. నిలకడలేమి ప్రధాన సమస్య.. అయితేనేం పాక్‌తో అంత ఆషామాషీ కాదు

అంచనాలకు అందని క్రికెట్‌ జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్థాన్‌. ఆటగాళ్లు ఎప్పుడు ఎలా ఆడతారో ఊహించడం కష్టసాధ్యం. ఒక మ్యాచ్‌లో ఉన్నత స్థాయి ఆటతీరును ప్రదర్శిస్తే.. తరువాతి మ్యాచ్‌లో ఒక్కసారిగా కుప్పకూలతారు. అలా అని వారిని తక్కువ అంచనా వేయకూడదని క్రికెట్‌ విశ్లేషకులు చెబుతుంటారు. టీ20ల్లో పాక్‌కు తిరుగులేని రికార్డు ఉంది. గత ఐదు టీ20 సిరీసుల్లో నాలుగింటిని సొంతం చేసుకుంది. 2009లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను పాక్‌ గెలుచుకుంది.

9. దాడులను ఖండిస్తున్నాం.. డీజీపీలో మార్పు రావాలి: సోము వీర్రాజు

ఏపీలో తెదేపా కార్యాలయాలపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడం మంచిది కాదని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. భాజపా తరఫున ఇలాంటి అనైతిక సంఘటనలను ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెదేపా చేసిన ఆరోపణలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు కానీ వైకాపా చేసిన భౌతిక దాడులపై స్పందించలేదన్నారు.

10. అదుపులోనే మహమ్మారి.. కానీ!
 దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. అయితే కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ముందురోజు 13 వేలకు పడిపోయిన కేసులు.. తాజాగా 14,623కి చేరాయి. మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది.

బ్రిటన్‌లో కేసులు పెరగడానికి అదే కారణం?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని