Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 23 Sep 2023 20:59 IST

1. తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు: నారా లోకేశ్‌

తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. శాంతియుత నిరసనలపై కేసులు బ్రిటీష్‌ కాలంలో కూడా లేవన్నారు. బ్రిటీష్‌ పాలనను మించిన స్థాయిలో రాష్ట్రంలో ప్రజలు, తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు, నిర్బంధాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి మద్దతుగా చేస్తున్న నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలపైనా హత్యాయత్నం కేసులు అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ సంపత్‌, వ్యాపారవేత్త శ్రీనివాస్‌రెడ్డి దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రేవంత్‌, మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌  మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. కొందరు ముఖ్యనాయకులు త్వరలోనే పార్టీలో చేరి కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారని వివరించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌కు అమెజాన్ రెడీ.. వీటిపైనే డీల్స్‌!

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌కు సిద్ధమైంది. ‘త్వరలో’ ఈ సేల్‌ ప్రారంభం కాబోతోందంటూ సంబంధిత బ్యానర్‌ను అమెజాన్‌ వెబ్‌సైట్‌/ యాప్‌లో ప్రదర్శిస్తోంది. అయితే, ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. అక్టోబర్‌ మొదటి వారం నుంచి ఈ సేల్‌ ప్రారంభయ్యే అవకాశం కనిపిస్తోంది. మరో ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం ఇదే తరహాలో బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరిట బ్యానర్‌ ప్రదర్శిస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. కాంగ్రెస్‌ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!

కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ (Gaurav Gogoi)పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్‌ శర్మ (Riniki Bhuyan Sharma) స్థానిక కోర్టులో రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా తన కంపెనీకి రూ.10 కోట్ల సబ్సిడీ అందిందంటూ గొగొయ్‌ తప్పుడు ఆరోపణలు చేశారని రిణికి భూయాన్‌ శర్మ అన్నారు. ఈ మేరకు కామ్‌రూప్‌ మెట్రోపాలిటన్‌లోని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో కేసు (Defamation Suit) దాఖలు చేశామని ఆమె తరఫు న్యాయవాది ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. అలాంటి పోలీసు చిత్రాలు డేంజర్‌: బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వరమైన న్యాయాన్ని అందించే సింగం(Singham) వంటి పోలీసు సినిమాలు ప్రమాదకరమని బాంబే హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్(Justice Gautam Patel of the Bombay High Court ) అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలు హానికరమైన సందేశాన్ని పంపుతాయని అన్నారు. ఇండియన్ పోలీసు ఫౌండేషన్ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా న్యాయ ప్రక్రియ విషయంలో ప్రజల అసహనాన్ని ప్రశ్నించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. సిగరెట్లపై నిషేధం విధించనున్న సునాక్‌ ప్రభుత్వం!

తమ దేశాన్ని పొగ రహితంగా మార్చేందుకు బ్రిటన్‌ (Britan) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం భవిష్యత్తు తరం సిగరెట్లు (cigarettes)వినియోగించకుండా వాటి అమ్మకంపై త్వరలో నిషేధం విధించేందుకు ప్రణాళికలు రచిస్తోందని బ్రిటన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు గార్డియన్‌ పత్రిక శుక్రవారం కథనాలు ప్రచురించింది. భవిష్యత్తు తరం సిగరెట్ల వినియోగించడం, కొనుగోలు చేయడంపై నిషేధం విధించే అంశాన్ని ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak)ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంలో రిషి న్యూజిలాండ్‌ చట్టాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. రాత్రి సమయంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి.. చివరకు..!

రాత్రి సమయంలో రెండేళ్ల బాలిక అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు కంగారుపడిపోయారు. ఆమె జాడ కోసం డ్రోన్లు, పోలీసు జాగిలాలతో అధికారులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. తీరా చూస్తే.. ఆ చిన్నారి ఇంటికి మూడు మైళ్ల దూరంలో హాయిగా నిద్రిస్తూ కనిపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? అమెరికాలోని మిచిగాన్‌ (Michigan) కు చెందిన రెండెళ్ల చిన్నారి థియా చేజ్‌. తన రెండు పెంపుడు శునకాలతో ఆడుకుంటూ బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. చాలాసేపటి వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. తొలి రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ

 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు తొలి రోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు కాన్ఫరెన్స్‌ హాలులోనే అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఆయన్ను ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించింది. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో సుమారు 6గంటల పాటు సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ సమక్షంలో ఈ విచారణ కొనసాగింది. విచారణకు ముందు, తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్‌ ఆధారంగా విచారించారు: సినీనటుడు నవదీప్‌

మాదాపూర్‌ డ్రగ్స్‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు నవదీప్‌ విచారణ ముగిసింది. శనివారం బషీర్‌బాగ్‌లోని టీఎస్‌ నార్కోటిక్‌ విభాగం పోలీసుల నవదీప్‌ను వివిధ కోణాల్లో ప్రశ్నించారు. విచారణ ముగిసిన తర్వాత నవదీప్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘నార్కోటిక్‌ బ్యూరో అధికారులు.. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి కొంత సమాచారం తెలుసుకునేందుకు రావాలని నోటీసు ఇస్తే వచ్చా. టీఎస్‌ నార్కోటిక్‌ అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉంది. అధికారులు అద్భుతమైన టీమ్‌ను ఏర్పాటు చేశారు’’ అని నవదీప్‌ వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 30న కాకుండా అక్టోబరు 1న రాష్ట్రానికి రానున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. శాసనసభ ఎన్నికల కార్యాచరణను బహుముఖ వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలని భాజపా నిర్ణయించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని