2 Year Old Girl: రాత్రి సమయంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి.. చివరకు..!

రాత్రి సమయంలో రెండేళ్ల చిన్నారి అదృశ్యం కావడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు.. చివరకు ఏం జరిగిందంటే..!

Published : 23 Sep 2023 19:22 IST

(ప్రతీకాత్మక చిత్రం)

వాషింగ్టన్‌: రాత్రి సమయంలో రెండేళ్ల బాలిక అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు కంగారుపడిపోయారు. ఆమె జాడ కోసం డ్రోన్లు, పోలీసు జాగిలాలతో అధికారులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. తీరా చూస్తే.. ఆ చిన్నారి ఇంటికి మూడు మైళ్ల దూరంలో హాయిగా నిద్రిస్తూ కనిపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

అమెరికాలోని మిచిగాన్‌ (Michigan) కు చెందిన రెండెళ్ల చిన్నారి థియా చేజ్‌. తన రెండు పెంపుడు శునకాలతో ఆడుకుంటూ బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. చాలాసేపటి వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. స్థానికులతో కలిసి ఆ పాప జాడ కోసం చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో వెతికారు. అయినా ఆచూకీ దొరకకపోవడంతో కంగారు పడ్డారు. చివరకు డ్రోన్లు, పోలీసు జాగిలాలతో ప్రయత్నించినా వారికి నిరాశే ఎదురైంది. అయితే ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో వెళ్తుండగా, కుక్కను తలదిండుగా పెట్టుకుని చిన్నారి నిద్రిస్తున్న దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.

అయితే ఆ చిన్నారి తన ఇంటికి మూడు మైళ్ల దూరంలో ఉన్న అడవిలో నిద్రిస్తున్నట్లు గుర్తించారు. ఆ పాప రెండు పెంపుడు శునకాలలో ఒక పెట్ ఆ చిన్నారికి తలగడగా ఉండగా.. రెండో పెట్ ఆమెను సురక్షితంగా కాపలా కాస్తూ కనిపించింది. ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇలాంటి ఘటనే మేలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మిచిగాన్‌ లో ఓ కుటుంబం పర్యటనకు రాగా వారి 8 ఏళ్ల కుమారుడు తప్పిపోయాడు. దాదాపు 150 మందికి పైగా సిబ్బంది ఆ బాలుడి జాడ కోసం వెతికినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ బాలుడు అక్కడ వెచ్చదనం కోసం ఓ చెట్టు తొర్రలో పడుకుని ఉండగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు