Drugs Case: ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్‌ ఆధారంగా విచారించారు: సినీనటుడు నవదీప్‌

మాదాపూర్‌ డ్రగ్స్‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు నవదీప్‌ విచారణ ముగిసింది.

Updated : 23 Sep 2023 21:16 IST

హైదరాబాద్‌: మాదాపూర్‌ డ్రగ్స్‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు నవదీప్‌ విచారణ ముగిసింది. శనివారం బషీర్‌బాగ్‌లోని టీఎస్‌ నార్కోటిక్‌ విభాగం పోలీసుల నవదీప్‌ను వివిధ కోణాల్లో ప్రశ్నించారు. విచారణ ముగిసిన తర్వాత నవదీప్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘నార్కోటిక్‌ బ్యూరో అధికారులు.. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి కొంత సమాచారం తెలుసుకునేందుకు రావాలని నోటీసు ఇస్తే వచ్చా. టీఎస్‌ నార్కోటిక్‌ అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉంది. అధికారులు అద్భుతమైన టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్‌ ఆధారంగా నన్ను విచారించారు. బీపీఎం క్లబ్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. విశాఖకు చెందిన రామచంద్‌తో పరిచయం ఉంది. కానీ, అతని వద్ద ఎలాంటి డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదు. నేను ఎప్పుడూ.. ఎక్కడా డ్రగ్స్‌ తీసుకోలేదు. గతంలో సిట్‌, ఈడీ విచారించింది. ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్‌ విభాగం పోలీసులు విచారించారు. అవసరం ఉంటే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారు’’ అని నవదీప్‌ వెల్లడించారు.

డ్రగ్స్‌ కేసులో 81 లింకులు గుర్తించాం: ఎస్పీ సునీతారెడ్డి

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సినీనటుడు నవదీప్‌ను విచారించామని, అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చాడని యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. ‘‘మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో 81 లింకులు గుర్తించాం. 41 లింకుల వివరాలను నవదీప్‌ తెలిపాడు. డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు సిట్‌, ఈడీ విచారణలో నవదీప్‌ అంగీకరించాడు. ఇప్పుడు మాత్రం డ్రగ్స్‌ వాడలేదని సమాధానమిస్తున్నాడు. రామ్‌చంద్‌తో కలిసి నవదీప్‌ గతంలో బీపీఎం పబ్‌ నిర్వహించాడు. సెల్‌ఫోన్‌లో ఉన్న డేటాను నవదీప్‌ డిలీట్‌ చేశాడు. నవదీప్‌ ఫక్షన్‌ రీట్రైవ్‌ చేసి మళ్లీ విచారిస్తాం. నవదీప్‌ ఫోన్‌ డేటా పూర్తిగా వచ్చిన తర్వాతే మళ్లీ విచారణ ఉంటుంది’’ అని ఎస్పీ తెలిపారు. ఇవాళ విచారణకు హాజరైన నవదీప్‌ సెల్‌ఫోన్‌ను నార్కోటిక్‌ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు