Defamation: కాంగ్రెస్‌ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!

కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌పై అస్సాం సీఎం సతీమణి స్థానిక కోర్టులో రూ.10 కోట్లకు దావా వేశారు. తన కంపెనీకి రూ.10 కోట్ల సబ్సిడీ అందిందని గొగొయ్‌ తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె అన్నారు.

Published : 23 Sep 2023 19:39 IST

దిస్పుర్: కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ (Gaurav Gogoi)పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్‌ శర్మ (Riniki Bhuyan Sharma) స్థానిక కోర్టులో రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా తన కంపెనీకి రూ.10 కోట్ల సబ్సిడీ అందిందంటూ గొగొయ్‌ తప్పుడు ఆరోపణలు చేశారని రిణికి భూయాన్‌ శర్మ అన్నారు. ఈ మేరకు కామ్‌రూప్‌ మెట్రోపాలిటన్‌లోని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో కేసు (Defamation Suit) దాఖలు చేశామని ఆమె తరఫు న్యాయవాది ఓ వార్తాసంస్థకు వెల్లడించారు.

‘ట్విటర్‌ వేదికగా తప్పుడు ఆరోపణలు చేసిన గౌరవ్ గొగొయ్‌పై నా క్లయింట్‌ రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎన్నడూ దరఖాస్తు చేసుకోలేదని మేం ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాం. సామాజిక మాధ్యమాల వేదికగా గొగొయ్‌ చేసిన ఆరోపణలు వాస్తవాలపై ఆధారపడి లేవు. ఆయన ఎటువంటి కసరత్తు చేయకుండానే ఆరోపణలు చేశారు. మేం దీనిపై పోరాడతాం’ అని రిణికి శర్మ తరఫు న్యాయవాది తెలిపారు.

కేంద్రం నుంచి రాయితీలు పొందారంటూ.. అస్సాం సీఎంపై విమర్శల దాడి

హిమంత సతీమణి కంపెనీ ‘ప్రైడ్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’పై ఇటీవల ఓ వెబ్‌సైట్‌ కథనం వెలువరించింది. ‘2022 ఫిబ్రవరిలో ఈ కంపెనీ కలియాబోర్‌లో 10 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసింది. నెల రోజుల్లోనే దాన్ని పారిశ్రామిక ప్రాంతంగా మార్చింది. అందులో ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్ ఏర్పాటు పేరిట.. కేంద్రం నుంచి రూ.10 కోట్ల సబ్సిడీ పొందింది’ అని పేర్కొంది. ఇది కాస్త విమర్శలకు దారితీసింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌ గౌరవ్‌ గొగొయ్‌ దీన్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

ఈ ఆరోపణలు అస్సాం అసెంబ్లీని కుదిపేశాయి. ప్రతిపక్షాలు తమ ఆరోపణలకు ఆధారాలను చూపితే ఏ శిక్షకైనా సిద్ధమేనని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఇటీవల ప్రకటించారు. అవసరమైతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన ట్విటర్‌లో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే.. గొగొయ్‌పై రూ.10 కోట్లకు దావా వేసినట్ల రిణికి భూయాన్‌ శర్మ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని