Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Jan 2022 17:01 IST

1. మస్క్‌ మా తెలంగాణకు వచ్చేయండి.. టెస్లాకు కేటీఆర్‌ ఆహ్వానం

భారత విపణిలోకి టెస్లా (Tesla) విద్యుత్‌ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయన్న కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్‌ మస్క్ (Elon Musk) వ్యాఖ్యలపై తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) స్పందించారు. రాష్ట్రంలో టెస్లా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేయడానికి సంతోషిస్తామని వ్యాఖ్యానించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. భారత్‌లో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం ఉందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

2. కాంగ్రెస్‌ తొలి జాబితా.. సోనూసూద్‌ సోదరి పోటీ ఇక్కడి నుంచే!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్‌ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తన అధికార పీఠాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మొత్తం 86మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్‌ చన్నీ ఈసారి కూడా చామ్‌కౌర్‌ సాహెబ్‌ నుంచి బరిలో దిగుతుండగా.. పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీ చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

3. ముంబయి-దిల్లీ ‘రాజధాని’కి తప్పిన పెను ప్రమాదం

ముంబయి నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు శుక్రవారం రాత్రి గుజరాత్‌లోని వల్సాడ్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఉంచిన సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. రాత్రి 7.10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు శనివారం వెల్లడించారు. అయితే, ఈ రైలును ఉద్దేశపూర్వకంగానే పట్టాలు తప్పించే ప్రయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నామని వారు వెల్లడించారు. ‘ముంబయి- హజ్రత్ నిజాముద్దీన్ ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్.. వల్సాడ్‌ దగ్గర్లోని అతుల్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఉంచిన సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

4. ఇకనైనా తప్పుడు వైద్యాన్ని ఆపించండి: ప్రభుత్వాలకువైద్యుల లేఖ

రోనా విషయంలో గతేడాదిలో చేసిన తప్పులే ఈ ఏడాదిలోనూ పునరావృతమవుతున్నాయని దేశ, విదేశాల్లోని పలువురు భారతీయ సీనియర్‌ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ బాధితులకు అందిస్తున్న వైద్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వెంటనే ఈ తప్పుడు వైద్య చికిత్సను నిలిపివేసేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ  లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

5. వినూత్న ప్రయోగానికి విశేష ఆదరణ.. 24గంటల్లో 8లక్షల స్పందనలు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌).. సీఎం అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం కొత్త ఒరవడికి తెరతీసిన విషయం తెలిసిందే. 7074870748కి కాల్‌/మేసేజ్‌/వాట్సాప్ చేసి నచ్చిన అభ్యర్థిని ఎంచుకోమని తెలుపగా.. దీనికి విశేష స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. 24 గంటల్లోనే 8లక్షల మంది స్పందించి సీఎంగా ఎవరు కావాలో తమ అభిప్రాయం తెలియజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

Hero: హీరో సినిమా రివ్యూ

6. అప్పన్న ఆలయంలో ఈ నిబంధనలు పాటించాల్సిందే!

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీ దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు సింహాచలం అప్పన్న ఆలయంలో ఇవాళ్టి నుంచి కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తున్నట్టు ఈవో ఎం.వి.సూర్యకళ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

7. పండగ వేళ.. సినీ తారలు ఇలా!

భోగి పండగ సందర్భంగా పలువురు సినీ తారలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. కొందరు కుటుంబ సభ్యులతో మరికొందరు స్నేహితులతో కలిసి సందడి చేశారు. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ విశేషాలు మీకోసం...పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

8. మరో ప్రపంచ స్థాయి ఆటగాడు సిద్ధమవుతున్నాడు : రవిశాస్త్రి

దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ సాధించడంలో కీలకంగా వ్యవహరించిన యువ ఆటగాడు కీగన్‌ పీటర్సన్‌పై టీమ్ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికా జట్టు నుంచి మరో ప్రపంచ స్థాయి ఆటగాడు రాబోతున్నాడని ప్రశంసించాడు. ‘కీగన్‌ పీటర్సన్‌ తన కెరీర్‌ను ఎంతో అద్భుతంగా ప్రారంభించాడు. దక్షిణాఫ్రికా జట్టు నుంచి మరో ప్రపంచ స్థాయి ఆటగాడు సిద్ధమవుతున్నాడు. అతడు బ్యాటింగ్‌ చేసిన తీరు.. దిగ్గజ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్‌ను గుర్తు చేసింది’ అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

9. ‘ఆచార్య’ సినిమా విడుదల వాయిదా

కరోనా ఉద్ధృతి దృష్ట్యా పెద్ద సినిమాల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్‌ సినిమాలు వాయిదాపడ్డాయి. ఆచార్య కూడా అదే బాటలో వెళ్లింది. అగ్రకథానాయకుడు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా ఉద్ధృతి దృష్ట్యా సినిమాను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

10. మాజీ ప్రియుడిని ఇరికించబోయి.. తను ఇరుక్కుంది!

 సాధారణంగా ప్రేమ విషయంలో విభేదాలు తలెత్తితే.. అమ్మాయిలు వేధింపులకు గురవుతుంటారు. కానీ, ఐర్లాండ్‌కి చెందిన ఓ అమ్మాయే అబ్బాయిపై సోషల్‌మీడియా వేదికగా వేధింపులకు పాల్పడింది. అతడిపై నేరారోపణ చేసేందుకు ప్రయత్నించింది. కానీ, వ్యూహం బెడిసికొట్టి తనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ వివరాలేంటో చదివేయండి మరి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని