Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Jan 2022 13:05 IST

1. China: చైనా సమర్పించు.. చెవిలో పూలు..!

‘జీరో కొవిడ్‌ పాలసీ’..! కోట్ల మంది కఠిన లాక్డౌన్‌లోకి..! వైరస్‌ అణిచివేతకు పరుగులు పెడుతున్న అధికారులు.. ఇటీవల కాలంలో చైనా నుంచి తరచూ వెలువడుతున్న వార్తలివి. ఒకటీ అరా కేసులు వస్తోంటనే కఠిన చర్యలు తీసుకొంటున్నామని అధికారులు గొప్పగా చెప్పుకుంటున్నా.. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అక్కడ పుట్టగొడుగుల్లా వైరస్‌ అవుట్‌బ్రేక్‌ (వైరస్‌ నిర్ణీత ప్రాంతంలో వ్యాపించడం)లు వస్తున్నాయని చైనా వైరాలజిస్టు ఒకరు ఆంగ్ల పత్రిక సీఎన్‌ఎన్‌కు తెలియజేశారు. ఏబీసీ సంస్థ అక్కడ అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. CM Jagan: సివిల్‌ వివాదాలకు స్వస్తి పలకాలన్నదే లక్ష్యం: జగన్‌

 భూములకు సంబంధించి కొన్ని చోట్ల రికార్డుల్లో ఒక మాదిరిగా.. క్షేత్రస్థాయిలో మరో విధంగా ఉంటోందని సీఎం జగన్‌ అన్నారు. సివిల్‌ వివాదాలకు స్వస్తి పలకాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో భూముల రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో 37 చోట్ల దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సేవలను ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్‌

3. Republic Day: ప్రధాని లక్ష్యంగా గణతంత్ర వేడుకలపై ఉగ్ర కుట్ర..!

ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని గణతంత్ర దినోత్సవం నాడు భారీ ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నాయని నిఘా సంస్థలకు సమాచారం అందినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌, అఫ్గాన్‌-పాక్‌ ప్రాంతానికి చెందిన ముష్కరులు ఈ దాడులకు తెగబడే అవకాశాలున్నట్లు నిఘా సంస్థలకు వచ్చిన అలర్ట్‌లో ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. oxfam report 2021: కుబేరులకు కోట్లు కురిపించిన కొవిడ్‌

కొవిడ్‌ 19 విరుచుకుపడిన ఈ రెండేళ్లలో ప్రపంచమంతటా 99శాతం ప్రజల ఆదాయాలు కోసుకుపోయి 16 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోగా.. ధనవంతులు మాత్రం మహా సంపన్నులయ్యారని ఆక్స్‌ ఫామ్‌ సంస్థ వెల్లడించింది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక ఆన్‌లైన్‌ శిఖరాగ్ర సభ ప్రారంభమైన సందర్భంగా ‘ప్రాణాంతక అసమానతలు’ అనే శీర్షికతో ఆక్స్‌ ఫామ్‌ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. కొవిడ్‌ కాలంలో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు కుబేరుల పాలిట కల్పవృక్షాలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు

రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు సినిమా షెడ్యూల్స్‌ను తారుమారు చేశాయి. సంక్రాంతికి సందడి చేయాల్సిన పెద్ద సినిమాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా కొన్ని చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటితో పాటు, ఓటీటీలోనూ అలరించే చిత్రాలు రెడీగా ఉన్నాయి. అవేంటో చూసేయండి. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Republic Day: శకటాల తిరస్కరణతో.. కేంద్రానికి సంబంధం లేదు

రానున్న గణతంత్ర వేడుకల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ప్రతిపాదించిన శకటాలను తిరస్కరించడంలో కేంద్రం పాత్రేమీ లేదని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఏయే శకటాలను అనుమతించాలో నిపుణుల కమిటీనే నిర్ణయిస్తుందని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశాయి. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయన నెలకొల్పిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని గుర్తుచేసేలా శకటాన్ని రూపొందించామని, దీన్ని కేంద్రం తిరస్కరించడంతో బెంగాల్‌ ప్రజల మనోభావాలను దెబ్బతిన్నాయంటూ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Corona: కాస్త తగ్గిన మహమ్మారి ఉద్ధృతి.. అయినా 2 లక్షలకు పైనే కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 16.49లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 2,38,018 మందికి పాజటివ్‌గా తేలింది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు 20వేలకు పైగా తగ్గడం కాస్త సానుకూలాంశం. ఇక పాజిటివిటీ రేటు కూడా 19.65శాతం నుంచి 14.43శాతానికి తగ్గడం ఊరటనిస్తోంది. మరోవైపు 24 గంటల వ్యవధిలో మరో 310 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,86761 మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వారందరికీ ప్రికాషన్‌ డోసు ఇవ్వాలి: కేంద్రమంత్రికి హరీశ్‌రావు లేఖ

కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు, బూస్టర్‌ డోసు మధ్య గడువును తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. హెల్త్‌ కేర్‌ వర్కర్లకు రెండో డోసు, ప్రికాషన్‌ డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్లు దాటిన అందరికీ ప్రికాషన్‌ డోసు ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Kisan Vikas Patra: మీ డబ్బు రెట్టింప‌వ్వ‌డానికి ఎంత కాలం ప‌డుతుంది?

కిసాన్ వికాస్ ప‌త్ర (కేవీపీ) ఒక పోస్ట్ ఆఫీస్ పొదుపు పధకం. ఈ ప‌థ‌కంలో మీ డ‌బ్బు రెట్టింపు అవ్వ‌డానికి 124 నెల‌లు (10 సంవ‌త్స‌రాల 4 నెల‌లు) ప‌డుతుంది. మార్కెట్ హెచ్చుత‌గ్గుల‌తో సంబంధం లేకుండా హామీ మొత్తం ల‌భిస్తుంది. దీర్ఘ‌కాలానికి పొదుపు చేయాల‌నుకునే పెట్టుబ‌డిదారులు కిసాన్ వికాస్ ప‌త్ర (కేవీపీ)లో పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిదే. ప్ర‌భుత్వ గ్యారెంటీ ద్వారా పెట్టుబ‌డి పెట్ట‌బ‌డిన ప్ర‌ధాన మొత్తం సుర‌క్షితంగా ఉండ‌ట‌మే కాకుండా పెట్టుబ‌డిదారుడు సంపాదించిన వ‌డ్డీ కూడా పూర్తిగా సుర‌క్షితం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎన్నికల వేళ పంజాబ్‌లో ఈడీ సోదాలు.. సీఎం చన్నీ బంధువుఇంట్లో తనిఖీలు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు కలకలం రేపుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా నేడు సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ బంధువు నివాసంలోనూ తనిఖీలు జరుపుతున్నారు. చన్నీ బంధువు భూపిందర్‌ సింగ్‌ హనీ నివాసంతో పాటు మరో 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. చన్నీ మరదలి కుమారుడైన భూపిందర్‌ సింగ్‌ హనీ.. పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని