Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Jun 2023 17:05 IST

1. బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టాం: కేటీఆర్‌

ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని చెప్పారు. టీ-హబ్‌లో ఐటీశాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్లుగా ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.1.8 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ముందస్తు ఎన్నికలు.. మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైకాపాకు లేదని చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన వైకాపా సభలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయన్నారు. వైకాపా బలంగా ఉందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని పెద్దిరెడ్డి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ వాయిదాకు హైకోర్టు నిరాకరణ

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ఈనెల 11న జరగనుంది. కాగా.. 2022 ఏప్రిల్‌ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జగన్‌ కనుసన్నల్లో.. సజ్జల డైరెక్షన్‌లోనే దాడులు: దేవినేని ఉమ

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తెదేపా నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం సబబా అని ప్రశ్నించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.‘‘ఇంకెంతమందిపై దాడి చేస్తారు? మీ కళ్లమంట చల్లారలేదా? ప్రజా సమస్యలపై పోరాడటమే తప్పా?’’ అని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఉద్యోగులు బయటికెళ్లకుండా ఆఫీసుకు తాళాలు.. వివాదంలో ఎడ్‌టెక్‌ కంపెనీ

హరియాణా (Haryana)లోని గురుగ్రామ్‌ (Gurugram)కు చెందిన కోడింగ్‌ నింజాస్‌ (Coding Ninjas) అనే ఎడ్‌టెక్‌ (ED-Tech) కంపెనీ చేసిన నిర్వాకం విమర్శలకు దారితీసింది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు వెళ్లకుండా కంపెనీ యాజమాన్యం ఆఫీసుకు తాళాలు వేయించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ (Viral Video)గా మారింది. అందులో వాచ్‌మెన్‌ ఆఫీసు డోర్‌కు తాళాలు వేస్తూ కన్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రైల్వే విధుల్లోకి టాప్‌ రెజ్లర్లు.. ఆందోళన కొనసాగుతుంది

కొన్ని వారాలుగా దిల్లీలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌  రైల్వేలో తిరిగి విధుల్లో చేరారు. రెజ్లర్ల బృందం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన రెండురోజుల్లోనే ఈ విషయం బయటకు రావడం గమనార్హం. సాక్షి భర్త సత్యవర్త్‌ కడియన్‌ ఇటీవల మాట్లాడుతూ తమకు హోంశాఖ మంత్రి నుంచి ఆశించిన ప్రతిస్పందన రాలేదని నిరాశ వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌ సరిహద్దుల్లో భారీగా చైనా నిర్మాణాలు: చాథమ్‌ హౌస్‌

భారత్‌ సరిహద్దుల సమీపంలోని చైనా ఆక్రమిత ఆక్సాయ్‌చిన్‌లో పీఎల్‌ఏ(China) భారీగా నిర్మాణాలు చేపడుతోందని యూకేకు చెందిన ప్రముఖ థింక్‌ట్యాంక్‌ చాథమ్‌హౌస్‌ (రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌) పేర్కొంది. పీఎల్‌ఏ సైనికులు మోహరించేందుకు వీలుగా సౌకర్యవంతమైన వాతావరణం చైనా సృష్టించిందని పేర్కొంది. రోడ్ల విస్తరణ, అవుట్‌పోస్టుల నిర్మాణం, క్యాంపుల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒడిశా రైలు దుర్ఘటన.. ‘నిర్లక్ష్యం’ అభియోగాలతో కేసు నమోదు..!

యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిశా రైలు దుర్ఘటనపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘నిర్లక్ష్యంతో ప్రాణాలకు హాని కలిగించడం, మరణాలకు కారణమవ్వడం’’ వంటి అభియోగాలతో ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టనుంది. అయితే, ప్రస్తుతానికి ఈ నిర్లక్ష్యానికి పాల్పడిన రైల్వే ఉద్యోగులు ఎవరనేది ఇంకా తేలలేదని, దర్యాప్తులో ఆ విషయం బయటపడుతుందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ.1700 కోట్ల వంతెన కూల్చివేత.. గార్డు గల్లంతు..

బిహార్‌లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెనను.. డిజైన్ లోపాలతో కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీని తర్వాత సమీపంలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ గార్డు ఆచూకీ గల్లంతైనట్లు తెలిపారు. భాగల్‌పుర్‌, ఖగడియా జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న అగువానీ - సుల్తాన్‌గంజ్‌ వంతెన పిల్లర్లు గత ఏప్రిల్‌ నెలలో తుపాను కారణంగా కొంతభాగం దెబ్బతిన్నాయి. బిహార్‌ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రూ.1,717 కోట్లు కేటాయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. విమానాన్ని వెంబడించిన ఫైటర్‌ జెట్‌.. సానిక్‌ బూమ్‌తో హడలిన వాషింగ్టన్‌

అమెరికా (USA) రాజధాని వాషింగ్టన్‌ (Washington) గగనతలంలో ఓ చిన్న విమానం తీవ్ర కలకలం సృష్టించింది. అనుమానాస్పదంగా కన్పించిన ఆ విమానాన్ని ఎఫ్‌-16 యుద్ధ విమానం (Fighter Jet) వెంబడించింది. అయితే ఈ ఫైటర్ జెట్‌ అత్యంత వేగంగా జనావాసాలపై నుంచి ప్రయాణించడంతో భారీ స్థాయిలో శబ్దాలు వినిపించాయి. దీంతో వాషింగ్టన్‌ ప్రజలు హడలిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని