Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 19 Aug 2022 21:02 IST

1. చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నేత గోవర్ధన్‌రెడ్డి

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి సోదరుడి కుమారుడు గోవర్ధన్‌రెడ్డి.. చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోవర్ధన్‌రెడ్డికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. కొల్లిపర మండలం నుంచి వచ్చిన కార్యకర్తలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.

2. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసింది తిరిగి అనుభవించాల్సిందే: కేటీఆర్‌

గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్‌ భాజపాపై విమర్శలు గుప్పించారు. ఒమిషన్‌, కమిషన్‌, రెమిషన్‌ లాంటి చర్యలను మరిచిపోలేమని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ట్విటర్లో స్పందించిన కేటీఆర్‌.. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు అభివృద్ధి, భద్రత, సంక్షేమంపై ఎన్నో హామీలు చూశామన్నారు. అయితే, ఇప్పుడు రేపిస్టులు, గర్భిణిలు, చిన్నారులను హత్య చేసిన వారిని విడుదల చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

3. అంబర్‌పేటలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఇంటర్‌బోర్డు కీలక ఆదేశాలు

అంబర్‌పేట పరిధిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి టీసీ గురించి మాట్లాడుదామని ప్రిన్సిపల్‌ గదికి వెళ్లిన ఓ విద్యార్థి నాయకుడు తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్‌ మీద పోసుకున్నాడు. పక్కనే దీపం ఉండటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్‌, పాలనా అధికారికి గాయాలయ్యాయి. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

4. నిన్నటిలా రాణించాలి.. రేపు సిరీస్‌ విజేతగా నిలవాలి

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను టీమ్ఇండియా ఘనంగా ప్రారంభించింది. గురవారం జరిగిన తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. శనివారం హరారే వేదికగానే జింబాబ్వే-భారత్ జట్ల మధ్య రెండో మ్యాచ్‌ జరగనుంది. ఇందులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా జింబాబ్వే పుంజుకోవడం ఖాయం.

5. అంతా సిద్ధం! ఆ 40 అంతస్తుల టవర్లు ఎలా కూల్చుతారంటే..?

ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ (Noida twin towers) కూల్చివేతకు అంతా సిద్ధమైంది. ఈ నెల 28న కూల్చివేయాలని సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ విధించడంతో అధికారులు అందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఆగస్టు 28న (ఆదివారం) మధ్యాహ్నం  2.30గంటలకు ఈ బహుళ అంతస్తుల భవనాలను నేలమట్టం చేయాలని నిర్ణయించారు. అయితే, అంతకన్నా ముందు ఉదయం 7గంటలకే ఈ టవర్స్‌ సమీపంలో నివాసం ఉండే ప్రజల్ని ఖాళీ చేయించనున్నారు.

6. ఆ ‘కారు’ గేట్‌.. మహీంద్రా మదిలో డౌట్‌.. ఏంటా కథ?

సోషల్‌మీడియాలో తరచూ సృజనాత్మక, స్ఫూర్తినింపే కథనాలు, వీడియోలను పోస్ట్‌ చేసే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా తాజాగా మరో ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు. ఓ వ్యక్తి తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న విచిత్రమైన గేటుకు సంబంధించిన వీడియో అది. అది చూడగానే మహీంద్రా మదిలో ఆశ్చర్యంతో పాటు అనేక ప్రశ్నలు తలెత్తాయట. ఆనంద్‌ మహీంద్రా శుక్రవారం తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

7. 16 మంది నిందితుల్లో సిసోదియా నం.1: సీబీఐ ఎఫ్‌ఐఆర్‌

దేశ రాజధాని నగరం దిల్లీలో మద్యం విధానంపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో 16మంది నిందితుల పేర్లు ఉంటే, అందులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా పేరు మొదటి స్థానంలో ఉందని సీబీఐ పేర్కొంది. 16మందితో కూడిన ఈ జాబితాలో సిసోదియా పేరు మొదట్లో ఉన్న ఓ జాబితా వెలుగులోకి వచ్చింది. ఈ జాబితాలో అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ అర్వ గోపీకృష్ణ సహా మరో ముగ్గురు అధికారులు ఉన్నారు.

8. దేశం కోసం.. ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి..!

దేశ రాజధాని దిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కారులో సీబీఐ సోదాలు కలకలం రేపుతోన్న సమయంలో.. ఆ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ మిస్డ్‌కాల్‌ ప్రచారం ప్రారంభించారు. ఈ జాతీయ మిషన్‌లో పాల్గొనాలని ప్రజలను అభ్యర్థించారు. ‘భారత్‌ను నంబర్‌ వన్‌గా నిలిపే జాతీయ మిషన్‌లో చేరేందుకు 9510001000కి మిస్డ్ కాల్ ఇవ్వండి. భారత్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్తాం’ అని కేజ్రీవాల్‌ వీడియో సందేశంలో వెల్లడించారు.

9. పాకిస్థాన్‌ ప్రధాని నోట.. శాంతి మాట

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ కశ్మీర్‌ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నట్లు తెలిపిన ఆయన.. జమ్మూకశ్మీర్‌ అంశంలోనూ శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా వచ్చిన నీల్‌ హాక్సిన్‌తో భేటీ సందర్భంగా పాక్‌ ప్రధాని భారత్‌ అంశాన్ని ప్రస్తావించారు. అయితే, భారత విదేశాంగ విధానంపై మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ పొగడ్తలు గుప్పిస్తోన్న తరుణంలో షెహబాజ్‌ షరీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

10. అణుకేంద్రం నిస్సైనికీకరణకు రష్యా ‘నో’

జపొరిజియా అణుకేంద్రం నిస్సైనికీకరణ కోసం ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న విజ్ఞప్తులను రష్యా తిరస్కరించింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఈ అణుకేంద్రం కొన్ని నెలలుగా రష్యా ఆధీనంలో ఉంది. ఒక వేళ ఇది పూర్తిగా నిస్సైనికీకరణ అయితే మరింత ముప్పు ఉంటుందని రష్యా చెబుతోంది.  ఐరోపాలోనే అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌ అయిన జపొరిజియాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరు పక్షాలు దీనిని అడ్డుం పెట్టుకొని పరస్పరం షెల్లింగ్‌ చేసుకొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని