Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 27 Jan 2022 21:09 IST

1.విజయవాడకు వంగవీటిపేరు పెట్టాలనే డిమాండ్ వస్తే చెప్పాలి: పేర్ని నాని

జిల్లా కేంద్రాలు, పునర్‌వ్యవస్థీకరణపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నాని సూచించారు. గతంలో ప్రజలకు అందుబాటులో లేకుండా జిల్లా కేంద్రాలు ఉండేవని చెప్పారు. విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ వస్తే చెప్పాలని తెలిపారు. మెజారిటీ ప్రజల ఆమోదాన్నే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నట్లు వెల్లడించారు.

2.కొత్త జిల్లాలపై రాత్రికి రాత్రే నోటిఫికేషన్లు ఎందుకు?: చంద్రబాబు

నూతన జిల్లాల ఏర్పాటులో ప్రజల ఆకాంక్షల మేరకు వ్యవహరించాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ వేదికగా వ్యూహ కమిటీ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక చర్చ జరిగింది. కొత్త జిల్లాలపై చాలా చోట్ల వైకాపా నుంచే వ్యతిరేకత వస్తోందని చంద్రబాబు తెలిపారు. అశాస్త్రీయంగా జిల్లాల విభజనతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి వచ్చిందన్నారు.

Ap news: హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించండి : బాలకృష్ణ

3.తెరాస అధికారం ఒక్క సంవత్సరమే : బండి సంజయ్‌

భాజపాకు అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెరాస నేతలు, కార్యకర్తలు తీవ్రమైన మానసిక ఒత్తిడితోనే మా ఎంపీపై దాడి చేశారని విమర్శించారు. నిజామాబాద్‌లోని నందిపేట్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజల్లో చైతన్యం వచ్చింది, మార్పు కోరుకుంటున్నారు. ఈ ఒక్క సంవత్సరమే తెరాస అధికారంలో ఉంటుంది. తర్వాత కచ్చితంగా భాజపా ప్రభుత్వమే వస్తుంది.’’ అని  ధీమా వ్యక్తం చేశారు.

4.అదంతా అవాస్తవం.. నేను అలా మాట్లాడలేదు: నాగార్జున

సమంత-నాగచైతన్యల విడాకులపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అగ్ర కథానాయకుడు నాగార్జున అన్నారు. మొదట సమంతనే విడాకులు కావాలని కోరిందంటూ ఓ ఇంటర్వ్యూలో నాగార్జున అన్నారని వార్తలు వచ్చాయి. దీనిపై నాగార్జున ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘నాగచైతన్య-సమంత గురించి నేను మాట్లాడినట్లు సోషల్‌మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేను మాట్లాడినట్లు జరిగిన ప్రచారం అవాస్తవం. దయచేసి అవాస్తవాలను ఎవరూ ప్రసారం చేయొద్దు’’ అని నాగార్జున పేర్కొన్నారు.

5.ఎయిరిండియా ప్రైవేటీకరణ: వాజ్‌పేయీ హయాంలో మొదలై.. మోదీ హయాంలో పుట్టింటికి!

దేశంలోనే తొలి ఎయిర్‌లైన్స్‌.. దాదాపు 90 ఏళ్ల చరిత్ర.. మహారాజాగా కీర్తి.. ఇవన్నీ ఎయిరిండియా గురించే. కానీ ఇదంతా గతం. కానీ, ఇప్పటి ఎయిరిండియా అంటే అప్పులే గుర్తొస్తాయి. ‘సంస్థను విక్రయించడం.. లేదంటే మూసేయడం.. ఇదే మా ముందున్న మార్గం’ అని ఓ దశలో ప్రభుత్వమే పేర్కొందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ పలు దఫాల ప్రభుత్వ ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు పూర్తయ్యింది. దాన్ని నెలకొల్పిన టాటా సంస్థ గూటికే ఎయిరిండియా మళ్లీ చేరింది.

6.వారి చేతుల్లో ఎయిరిండియా వికసిస్తుంది.. కేంద్ర మంత్రి విశ్వాసం

ఎయిరిండియా యాజమాన్య హక్కులు గురువారం అధికారికంగా టాటా గ్రూప్‌నకు బదిలీ అయిన విషయం తెలిసిందే. దీనిపై పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ‘ఈ ప్రక్రియను నిర్ణీత వ్యవధిలోపు విజయవంతంగా పూర్తి చేయడం గమనించదగ్గ విషయం. ఇది ప్రభుత్వ సామర్థ్యాన్ని, భవిష్యత్తులో ఇతర రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణను సమర్థంగా నిర్వహించాలనే సంకల్పాన్ని రుజువు చేస్తుంది’ అని ట్వీట్‌ చేశారు.

Video: తెల్లటి అన్నంతో.. మధుమేహం ముప్పు..!

7.కరోనా అక్కడ తగ్గుతోంది.. ఇక్కడ పెరుగుతోంది: కేంద్రం

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ఒమిక్రాన్‌ ప్రభావంతో పెరుగుతున్న యాక్టివ్‌ కేసుల్లో దాదాపు 77శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్టు వెల్లడించింది. 11 రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు పేర్కొంది. వీటిలో ఒక్క కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే 3 లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉండగా.. తమిళనాడు, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌లలో లక్షకు పైగా ఉన్నాయని వివరించింది.

8.అఖిలేశ్‌ ప్రభుత్వం వస్తే మళ్లీ గూండారాజ్‌: అమిత్‌ షా

ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా రాజకీయ పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. తాజాగా భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సతువా గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజలకు ఆయనే స్వయంగా ప్రచార కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేశ్ యాదవ్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ గూండా రాజ్యమే వస్తుందని ఆరోపించారు.

9.ఈ విడత బడ్జెట్‌కు ఏదైనా థీమ్ ఉంటే.. అది ఉద్యోగాలే అయి ఉండాలి

త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ‘ఈసారి ఉద్యోగ కల్పనలో భారీ వృద్ధి అవసరం. ఈ బడ్జెట్‌కు ఏదైనా థీమ్ ఉంటే.. అది ఉద్యోగాలే అయిఉండాలి’ అని చెప్పారు. వృద్ధిని వేగవంతం చేయడంతోపాటు ఆర్థిక వ్యవస్థలో అసమానతలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా ఆయన ఓ జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

10.కపిల్ దేవ్‌లా నిఖార్సైన ఆల్ రౌండర్‌కి పగ్గాలివ్వాలి: రవిశాస్త్రి

టీమ్ఇండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలనే వాదనపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి విభేదించాడు. కపిల్ దేవ్‌ లాంటి నిఖార్సైన ఆల్‌ రౌండర్‌కి టెస్టు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. విరాట్‌ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలికినప్పటి నుంచి తర్వాతి కెప్టెన్‌ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని