Published : 28 Jan 2022 01:56 IST

Air India: ఎయిరిండియా ప్రైవేటీకరణ: వాజ్‌పేయీ హయాంలో మొదలై.. మోదీ హయాంలో పుట్టింటికి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోనే తొలి ఎయిర్‌లైన్స్‌.. దాదాపు 90 ఏళ్ల చరిత్ర.. మహారాజాగా కీర్తి.. ఇవన్నీ ఎయిరిండియా గురించే. కానీ ఇదంతా గతం. కానీ, ఇప్పటి ఎయిరిండియా అంటే అప్పులే గుర్తొస్తాయి. ‘సంస్థను విక్రయించడం.. లేదంటే మూసేయడం.. ఇదే మా ముందున్న మార్గం’ అని ఓ దశలో ప్రభుత్వమే పేర్కొందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ పలు దఫాల ప్రభుత్వ ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు పూర్తయ్యింది. దాన్ని నెలకొల్పిన టాటా సంస్థ గూటికే ఎయిరిండియా మళ్లీ చేరింది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా ప్రారంభం.. ప్రైవేటీకరణకు దారితీసిన పరిస్థితులు.. అందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఓ సారి చూద్దాం..

టాటా టు ప్రభుత్వం..

టాటా గ్రూప్‌ వ్యవస్థపాకుడు జేఆర్‌డీ టాటా 1932లో దేశీయంగా తొలి విమానయాన సంస్థను నెలకొల్పారు. అదే టాటా ఎయిర్‌లైన్స్‌. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్‌ కాలంలోనే కరాచీ- బొంబాయి మధ్య దీని సేవలు ప్రారంభమయ్యాయి. తర్వాత 1946లో ఎయిర్‌ ఇండియాగా మార్చారు. ఐరోపాకు విమానాలను ప్రారంభించడం ద్వారా ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ను ఆవిష్కరించారు. ఇందులో ప్రభుత్వానికి (49%), టాటాలకు (25%) వాటా ఉండేది. 1948లో ఎయిరిండియా అంతర్జాతీయ సేవలు ప్రారంభమయయ్యాయి. పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నడిచిన తొలి విమానయాన సంస్థ అదే. 1953లో ప్రభుత్వం ఎయిరిండియాను జాతీయీకరించింది. ప్రభుత్వ పరమైన కొన్నేళ్ల వరకు ఎయిరిండియా ఏకఛత్రాధిపత్యమే నడిచింది. అయితే దేశంలో సరళీకరణ విధానాల వల్ల 1994-95 మధ్యలో ప్రైవేటు విమానయాన సంస్థలు పుట్టుకొచ్చాయి. తక్కువ ధరకే టికెట్లు ఆఫర్‌ చేయడంతో ఎయిరిండియాకు నష్టాలు మొదలయ్యాయి. అవే ఎయిరిండియా ప్రైవేటీకరణకు బీజాలు వేశాయి.

వాజ్‌పేయీ హయాంలో తొలి యత్నం..

నష్టాల ఊబిలో ఉన్న ఎయిరిండియాలో వాటాలు విక్రయించేందుకు 2000-01 మధ్య అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ముందుకొచ్చింది. కనీసం 40 శాతం వాటాలను విక్రయించాలని అప్పట్లో నిర్ణయించింది. అప్పట్లో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, టాటా గ్రూప్‌ సంయుక్తంగా ఎయిరిండియాలో వాటాల కొనుగోలుకు ఆసక్తి కనబరిచాయి. అయితే, ప్రైవేటీకరణను ట్రేడ్‌ యూనియన్లు వ్యతిరేకిండచంతో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ వెనక్కి తగ్గింది. దీంతో ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగిపోయింది. 2007-08 మధ్య ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌తో ఎయిరిండియా విలీనం అయ్యాక సంస్థకు నష్టాలు మరింత పెరిగాయి. 2004-14 మధ్య కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ప్రైవేటీకరణ విషయంలో ఆసక్తి చూపలేదు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఎయిరిండియా ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడ్డాయి.

ప్రైవేటీకరణ ప్రయత్నాలు..

 • 2017 జూన్‌: ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకోసం మంత్రులతో కూడిన ప్యానెల్‌ ఏర్పాటైంది.
 • 2018 మార్చి: ఎయిరిండియాలో 76 శాతం వాటా కొనుగోలకు మోదీ ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానించింది. మే 14 వరకు గడువు విధించారు. అయితే, ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదు.
 • 2018 జూన్‌: చమురు ధరలు అదుపులోకి వచ్చేంత వరకు ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో వేగం తగ్గించాలని కేంద్రం నిర్ణయం.
 • 2020 జనవరి: ఈ సారి నూరు శాతం వాటాల విక్రయానికి ఆసక్తి వ్యక్తీకరణలను ప్రభుత్వం ఆహ్వానించింది. అప్పటికి ఎయిరిండియా అప్పులు రూ.60,074 కోట్లు ఉండగా.. రూ.23,286.5 కోట్ల అప్పుల్ని స్వాధీన సంస్థ చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
 • 2020 అక్టోబర్‌: డీల్‌ను ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. అప్పుల్ని ఎంతమేర భరించగలమన్నది సంస్థే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పిస్తూ డీల్‌లో మార్పు చేసింది.
 • 2020 డిసెంబర్‌: ఎయిరిండియాకు అధిక సంఖ్యలో బిడ్లు వచ్చినట్లు దీపమ్‌ కార్యదర్శి వెల్లడి
 • 2021 మార్చి: ఎయిరిండియాను విక్రయించడమో.. లేదంటే మూసేయడమే ప్రభుత్వం ముందున్న మార్గమని కేంద్ర పౌరవిమాన యాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ వ్యాఖ్య. రోజుకు రూ.20 కోట్ల మేర నష్టం వస్తున్నట్లు వెల్లడి.
 • 2021 ఏప్రిల్‌: ఎయిరిండియాకు ఫైనాన్షియల్‌ బిడ్లు ఆహ్వానం. సెప్టెంబర్‌ 15 వరకు గడువు.
 • 2021 సెప్టెంబర్‌: టాటా గ్రూప్‌, స్పైస్‌ జెట్‌ ప్రమోటర్‌ అజయ్‌ సింగ్‌ బిడ్లు దాఖలు.
 • 2021 అక్టోబర్‌ 8: రూ.18వేల కోట్లకు టాటా గ్రూప్‌ బిడ్‌ను గెలుచుకున్నట్లు ప్రభుత్వం వెల్లడి
 • 2021 అక్టోబర్‌ 25: ఎయిరిండియా అప్పగింతకు సంబంధించి టాటా గ్రూప్‌తో ప్రభుత్వం ఒప్పందం
 • 2021 జనవరి 27: ఎయిరిండియా యాజమాన్య బాధ్యతలు అధికారికంగా టాటా గ్రూప్‌కు బదలాయింపు

***

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని