
Budget 2022-23: ఈ విడత బడ్జెట్‌కు ఏదైనా థీమ్ ఉంటే.. అది ఉద్యోగాలే అయిఉండాలి
ఆర్బీఐ మాజీ గవర్నర్ డి.సుబ్బారావు
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఉద్యోగ కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ‘ఈసారి ఉద్యోగ కల్పనలో భారీ వృద్ధి అవసరం. ఈ బడ్జెట్‌కు ఏదైనా థీమ్ ఉంటే.. అది ఉద్యోగాలే అయిఉండాలి’ అని చెప్పారు. వృద్ధిని వేగవంతం చేయడంతోపాటు ఆర్థిక వ్యవస్థలో అసమానతలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా ఆయన ఓ జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై వ్యయాన్ని నిరంతరం పెంచాల్సిన అవసరం ఉన్నందున.. పన్ను తగ్గింపులకు పెద్దగా వెసులుబాటు ఉండదని అభిప్రాయపడ్డారు. అయితే, ఎగుమతి రంగంలో సుంకాలు తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది పన్ను వసూళ్లు బడ్జెట్ లక్ష్యం కంటే మెరుగ్గా ఉంటాయన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2022-23 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
‘ప్రతి బడ్జెట్ లక్ష్యం.. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే. అయితే, ఈ విడత.. ఆర్థిక అసమానతలను తగ్గించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’ అని డా.సుబ్బారావు అన్నారు. ‘ప్రపంచ అసమానతల అధ్యయన సంస్థ 2022 నివేదిక’ను ఉటంకిస్తూ.. కరోనా పరిస్థితుల కారణంగా అల్పాదాయ వర్గాలు దెబ్బతిన్నాయని.. అదే సమయంలో సంపన్నులు భారీగా కూడబెట్టినట్లు గుర్తుచేశారు. ఈ అసమానతలు నైతిక విలువలకు విరుద్ధమని, పైగా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను కూడా దెబ్బతీస్తాయని చెప్పారు. ఈ క్రమంలో పాలనాపర సంస్కరణల ద్వారా సులభతర వ్యాపారం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మెరుగుపరచడంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎగుమతులను పెంచాలని.. చెల్లింపుల్లో స్థిరత్వంతో పాటు ఉద్యోగాల కోణంలోనూ ఇది దోహదపడుతుందన్నారు. ఒమిక్రాన్ పరిస్థితుల ప్రభావం తక్కువగా ఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం వృద్ధిని సాధించగలమని, లేని పక్షంలో ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు.