Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jun 2023 21:07 IST

1.కాంగ్రెస్‌ రాజ్యంలో దళారులదే భోజ్యం: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాలమూరుకు ప్రత్యేక స్థానం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నాగర్‌ కర్నూల్‌లో నూతనంగా నిర్మించిన భారాస జిల్లా కార్యాలయం, కలెక్టరేట్‌ భవనాలను ప్రారంభించిన అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. పాలమూరు ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. ఇది మహబూబ్‌నగర్‌ జిల్లా కీర్తికిరీటంలో శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2.  ‘నీళ్లను చూసినా రక్తంలాగే అనిపిస్తోంది’ ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సవాళ్లు..!

బాలేశ్వర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం (Odihsa Train Accident) వందల మంది కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి ఒకవిధంగా ఉంటే.. మరణించిన కుటుంబీకుల పరిస్థితి హృదయవిదారకం. గుర్తుపట్టలేని విధంగా మారిన మృతదేహాల్లో తమ వారిని వెతుక్కునేందుకు వారు పడుతున్న ఆరాటం ఓవైపు.. అసలు తమ వారు ఎక్కడున్నారోనని మరికొందరి వేదన మరోవైపు. ఇలా అక్కడ నెలకొన్న పరిస్థితులు ప్రతిఒక్కరినీ కలచివేస్తున్నాయి. అయితే, ఇంతటి భీకరస్థితిలో సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) సిబ్బంది కూడా తీవ్రంగా కలత చెందుతున్నారట. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. బీసీ కుల వృత్తుల కుటుంబాలకు రూ.లక్ష సాయం.. విధి విధానాలు ఖరారు

రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా రాష్ట్రంలోని బీసీ కుల వృత్తుల వారికి కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర మంత్రిమండలి ఇటీవల నిర్ణయించింది. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన కుమ్మరి, మేదరి తదితర కులవృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ. లక్ష సాయం అందించాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4.  పోస్టల్‌లో 40,889 జీడీఎస్‌ జాబ్స్‌.. షార్ట్‌లిస్ట్‌ అయినవారి నాలుగో జాబితా ఇదే..

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని పోస్టల్‌ సర్కిళ్లలో 40వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి షార్ట్‌లిస్ట్‌ అయినవారి  నాలుగో జాబితాను తపాలాశాఖ(Postal Department) విడుదల చేసింది. వీరంతా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది.  దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్ల పరిధిలో గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్) నియామకాలు-2023కు సంబంధించి జనవరిలో మొత్తం 40,889 పోస్టులకు భారీ నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.  వీటిలో ఏపీ నుంచి 2,480 పోస్టులు; తెలంగాణలో 1266 చొప్పున ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. భారత్‌లో హోండా ఎలివేట్‌ ఆవిష్కరణ.. 2030 నాటికి 5 కార్లు

జపాన్‌కు చెందిన వాహన తయారీ సంస్థ హోండా (Honda India) భారత్‌లో ఐదు కొత్త ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనుంది. 2030 నాటికి వీటిని మార్కెట్‌లోకి తీసుకొస్తామని మంగళవారం ప్రకటించింది. దీంట్లో ఒకటి విద్యుత్‌ వాహనం కూడా ఉంటుందని తెలిపింది. మిడ్‌- సైజ్‌ ఎస్‌యూవీ విభాగంలో తీసుకొస్తున్న ఎలివేట్‌ (Honda Elevate)ను మంగళవారం హోండా భారత్‌లో ఆవిష్కరించింది. ఇది హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, మారుతీ సుజుకీ గ్రాండ్‌ విటారాతో పోటీ పడనుంది. ఈ కొత్త కారును రాబోయే పండగ సీజన్‌లో మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. తెలంగాణలో తెదేపాకు పూర్వ వైభవం వస్తుంది: చంద్రబాబు

తెలంగాణలో ఏదో ఒకరోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో తెదేపా అధికారంలో లేకపోయినా పార్టీ శ్రేణుల ఉత్సాహం బాగుందన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ఎన్టీఆర్‌, పీవీ నరసింహారావు దేశానికి దశ దిశ చూపించారు. తెదేపా వచ్చిన తర్వాతే తెలుగువారి ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పే పరిస్థితి వచ్చింది. తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తోందంటే తెదేపా వేసిన పునాదే కారణం. తెలుగు వాళ్లు ప్రపంచం నలుమూలలా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనతే’’ అని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. హైదరాబాద్‌లో మాస్‌ కాపీయింగ్‌.. వాట్సాప్‌ ద్వారా జేఈఈ సమాధానాలు

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినట్టు గుర్తించారు.  సికింద్రాబాద్‌ మార్కెట్‌, నాచారం, ఎల్బీనగర్‌, మల్కాజ్‌గిరి పీఎస్‌లలో మాస్‌ కాపీయింగ్‌పై కేసులు నమోదయ్యాయి. సికింద్రాబాద్‌ ఎస్వీఐటీ, నాచారం, ఎల్బీనగర్‌, మల్కాజ్‌గిరిలోని అయాన్‌ డిజిటల్‌ సెంటర్లలో మాస్‌ కాపీయింగ్‌ జరిగినట్టు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. అమర్‌నాథ్‌ యాత్రలో దాడికి.. పాక్‌ ఉగ్రవాదుల కుట్ర..?

త్వరలో జరగనున్న వార్షిక అమరనాథ్‌ యాత్ర (Amarnath Yatra)కు ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఈ యాత్రను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని పాకిస్థాన్‌ కేంద్రంగా విధ్వంసాలకు పాల్పడే ఉగ్రవాదులు (Pakistan Based Terrorists) కుట్ర పన్నుతున్నట్లు సమాచారం రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఆ క్రికెట్‌ బుకీని అమృతా ఫడణవీస్‌ పట్టించారిలా..!

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత (Amruta Fadnavis)ను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో ముంబయి పోలీసులు (Mumbai Police) ఇటీవల కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఇందులోని కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన క్రికెట్‌ బుకీ అనిల్‌ జైసింఘానీ (Anil Jaisinghani)ని అమృతా ఫడణవీస్‌ సాయంతోనే పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఇందులో అమృత అతడితో నిరంతరం ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని, ఓసారి ఆయన కుమార్తె అనిక్షను కూడా కలిశారని పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ చాటింగ్‌ స్క్రీన్‌షాట్లను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. దొంగల్ని పట్టుకుందామని పోతే.. ఉద్యోగం పోయే..!

మంచికిపోయి చెడు కొని తెచ్చుకున్నారు ఇద్దరు ఉద్యోగులు. తాము పనిచేస్తోన్న స్టోర్‌లో దొంగతనాన్ని అడ్డుకొని, ఆ దొంగల్ని పట్టుకుందామని ప్రయత్నించి ఉద్యోగం పోగొట్టుకున్నారు. వారిని తొలగించడంతో యాజమాన్యంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రఖ్యాత దుస్తుల సంస్థ లులులెమన్(Lululemon) స్టోర్‌లో ఈ ఘటన జరిగింది. అయితే తన నిర్ణయాన్ని సంస్థ సీఈఓ కాల్విన్‌ మెక్‌ డొనాల్డ్ సమర్థించుకున్నారు. దీనిపై ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని