దొంగల్ని పట్టుకుందామని పోతే.. ఉద్యోగం పోయే..!

దొంగల(burglars) వెంటపడి ఉద్యోగం పోగొట్టుకున్నారు ఇద్దరు ఉద్యోగులు. వారిని ఉద్యోగంలో నుంచి తీసేసిన సంస్థ.. తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 

Published : 06 Jun 2023 17:47 IST

వాంకోవర్‌: మంచికిపోయి చెడు కొని తెచ్చుకున్నారు ఇద్దరు ఉద్యోగులు. తాము పనిచేస్తోన్న స్టోర్‌లో దొంగతనాన్ని అడ్డుకొని, ఆ దొంగల్ని పట్టుకుందామని ప్రయత్నించి ఉద్యోగం పోగొట్టుకున్నారు. వారిని తొలగించడంతో యాజమాన్యంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రఖ్యాత దుస్తుల సంస్థ లులులెమన్(Lululemon) స్టోర్‌లో ఈ ఘటన జరిగింది. అయితే తన నిర్ణయాన్ని సంస్థ సీఈఓ కాల్విన్‌ మెక్‌ డొనాల్డ్ సమర్థించుకున్నారు. దీనిపై ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.

‘దొంగతనం జరిగే సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై మేం మా సిబ్బందికి శిక్షణ ఇస్తాం. దీనికి సంబంధించి మాకు జీరో టోలరెన్స్ పాలసీ ఉంది. మాకు మా సిబ్బంది, వినియోగదారుల భద్రతే ముఖ్యం. మా స్టోర్‌లో సిబ్బంది వ్యాపారాన్ని చూసుకోవాలి. దొంగతనం జరిగితే.. ఆ దొంగల్ని పట్టుకోవడానికి కావాల్సిన సాంకేతికత ఉంది. అలాగే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వీటన్నింటి గురించి మేం సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. దురదృష్టవశాత్తూ ఇక్కడ ఇద్దరు సిబ్బంది ఆ పాలసీని బ్రేక్ చేశారు. స్టోర్‌ వదిలి దొంగల వెంటపడ్డారు. చాలా సందర్భాల్లో వేర్వేరు ఘటనల్లో సిబ్బంది దొంగలతో పోరాడి గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అందుకే మేం ఈ పాలసీని కచ్చితంగా అమలు చేస్తాం. ఇందులో ఎలాంటి వెసులుబాటు ఉండదు. అందుకే విచారణ అనంతరం ఆ ఉద్యోగులను తొలగించాం’అని మెక్‌డొనాల్డ్ వెల్లడించారు.

అలాగే అట్లాంటాలోని ఈ సంస్థ స్టోర్‌లో కూడా దొంగతనం జరుగుతుంటే అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగిని దానిని అడ్డుకునేందుకు యత్నించారు. అది కాస్తా ఆమె ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. జీరో టోలరెన్స్ పాలసీని కారణంగా చూపి, ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారు. గత నెల ఈ ఘటన జరిగింది. ఉద్యోగులను తొలగిస్తున్న తీరుపై ఈ సంస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు