Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 23 Jun 2022 16:58 IST

1. మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌..!

గత రెండు రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గంటగంటకు అనూహ్య పరిణామాలతో సంకీర్ణ ప్రభుత్వం పతనం అంచులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ అసమ్మతి నేతలకు సరికొత్త ఆఫర్ ఇచ్చారు. 24 గంటల్లో వారంతా ముంబయికి తిరిగి వచ్చేస్తే.. మహావికాస్ అఘాడీ నుంచి శివసేన బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

హస్తినలో ద్రౌపదీ ముర్మూ.. ప్రధాని మోదీతో భేటీ

2. మాకు మాత్రం తలుపులు మూసివేశారు..

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. దీనిపై అసమ్మతి నేత ఏక్‌నాథ్ శిందే కౌంటర్ ఇచ్చారు. ‘ఇదీ వాస్తవ పరిస్థితి’ అంటూ ఎంవీఏ పాలనలో ఎదుర్కొన్న అవమానాలను ప్రస్తావించారు. అలాగే తాను తిరిగి రావాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అసంతృప్త ఎమ్మెల్యేలు రాసిన మూడు పేజీల లేఖను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

3. ఎవరు ఔనన్నా కాదన్నా విశాఖే పరిపాలనా రాజధాని: ఎంపీ విజయసాయిరెడ్డి

ఎవరు అడ్డుపడినా విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాజధాని తరలింపు ఆలస్యమవుతోందని.. ఎవరు ఔనన్నా కాదన్నా విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుందని చెప్పారు. విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నదుల్ని, కాలువలను ఆక్రమించుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. 

WOW 3: ఇంత మతిమరుపైతే ఎలా లైలా.. చివరికి భర్త పేరు కూడానా..!

4. ఆర్థిక ఇబ్బందుల వల్లే ‘దుల్హన్‌’ నిలిపివేత.. హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కారు

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం మైనారిటీ యువతులకు వివాహం సందర్భంగా ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్‌ పథకాన్ని నిలిపివేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం ప్రస్తుతం అమలులో లేదని పేర్కొంది. తెదేపా హయాంలో దుల్హన్‌ పథకం కింద పేద ముస్లిం మహిళల వివాహానికి ప్రభుత్వం రూ.50 వేలు అందజేసింది. 

TDP: పల్నాడులో నారా లోకేశ్‌ పర్యటన.. 

5. పిల్లలను సరిగా స్కూల్‌కి పంపితే ‘అమ్మఒడి’ వర్తిస్తుంది: బొత్స

అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమని.. పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపిక జరిగిందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితే పథకం వర్తిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. విజయనగరంలో అమృత్‌ పథకంలో భాగంగా రూ.1.96కోట్ల వ్యయంతో నిర్మించిన వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను మంత్రి ప్రారంభించారు.

6.  కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్‌ కుమార్తె 

దివంగత పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కుమార్తె, ఖైరతాబాద్‌ కార్పొరేటర్ విజయారెడ్డి గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల తెరాస పార్టీకి రాజీనామా చేసిన ఆమె..  ఇవాళ పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి గాంధీభవన్‌కు ర్యాలీగా వెళ్లారు. 

7. ఇకపై నాన్న సపోర్ట్‌ నాకొద్దు: ఆకాశ్ పూరీ

తన తండ్రి, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సపోర్ట్‌ ఇకపై తనకి వద్దన్నారు నటుడు ఆకాశ్‌ పూరీ. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. ఈ సినిమా జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘చోర్‌ బజార్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పరశురామ్‌, బండ్లగణేశ్‌, సాయి రామ్‌ శంకర్‌, విశ్వక్‌సేన్‌ తదితరులు పాల్గొన్న ఈ వేడుకలో ఆకాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Fatty Liver: కాలేయంపై కొవ్వు చేరిందా?.. ఈ జాగ్రత్తలు పాటించండి

8. ఆందోళన విరమించిన తెలుగు సినీ కార్మికులు

సినీ కార్మికులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో రేపటి నుంచి సినిమా చిత్రీకరణలకు హాజరుకానున్నట్టు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నాయకులు వెల్లడించారు. వేతనాల పెంపుపై రెండు రోజుల నుంచి ఆందోళనబాట పట్టిన కార్మిక సంఘాలు... సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చొరవతో నిర్మాతల మండలితో చర్చలు జరిపాయి. 

9. 91 ఏళ్ల రూపర్ట్‌ మర్దోక్‌కి నాలుగోసారి విడాకులు!

ప్రపంచ మీడియా మొఘల్‌గా పిలుచుకునే 91 ఏళ్ల రూపర్ట్ మర్దోక్‌ మరోసారి విడాకులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇది ఆయనకు నాలుగో విడాకులు కావడం గమనార్హం. నటి జెర్రీ హాల్‌ నుంచి ఆయన విడిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరువురి సన్నిహితులు వెల్లడించిన వివరాల ఆధారంగా న్యూయార్స్‌ టైమ్స్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది.

10. ఫ్రాన్స్‌లో కరోనా కొత్త వేవ్‌..!

ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లతో కరోనా ఇప్పటికీ విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా  కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కొత్త వేవ్‌ వస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్‌ ఫిషర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కరోనా కొత్త వేవ్‌ను ఎదుర్కొంటున్నట్లు తాజాగా వెల్లడించారు. ఫ్రాన్స్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని