Corona: ఫ్రాన్స్‌లో కరోనా కొత్త వేవ్‌.. ఫ్రాన్స్ వ్యాక్సినేషన్‌ చీఫ్‌ వెల్లడి

ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్‌ ఫిషర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కరోనా కొత్త వేవ్‌ను ఎదుర్కొంటున్నట్లు తాజాగా ఆయన వెల్లడించారు.

Published : 23 Jun 2022 03:59 IST

ఫ్రాన్స్‌: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ (Covid) సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కొత్త వేరియంట్లతో కరోనా (Corona) వైరస్‌ ఇప్పటికీ విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా  కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కొత్త వేవ్‌ (New Wave) వస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ (France) వ్యాక్సినేషన్ (Vaccination) చీఫ్ అలైన్‌ ఫిషర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కరోనా కొత్త వేవ్‌ను ఎదుర్కొంటున్నట్లు తాజాగా వెల్లడించారు.

ఫ్రాన్స్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అక్కడ ఒక్కరోజే 50 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు సంఖ్య దాదాపు రెండు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో అలైన్‌ ఫిషర్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. దేశంలో కరోనా కేసుల పెరుగుదలను చూస్తుంటే మహమ్మారి మరోసారి విజృంభిస్తుందనడంలో సందేహం లేదని అన్నారు. తాము కరోనా కొత్త వేవ్‌ను ఎదుర్కొంటున్నామని తెలిపారు. అయితే, కొత్త వేవ్‌ తీవ్రత ఎంత వరకు ఉంటుందనేది మాత్రం చెప్పలేమన్నారు. కాబట్టి దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా రవాణాలో మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫ్రాన్స్‌లో గత నెల చివరి వారం నుంచి కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఏడు రోజుల వ్యవధిలో అక్కడ రోజువారీ కేసులు మూడు రెట్లు పెరగడం గమనార్హం. మే 27న 17,705 కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్కరోజే 50,402 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా యూరోపియన్‌ దేశాల్లో ముఖ్యంగా పోర్చుగల్‌లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లు బీఏ.4, బీఏ.5 వేగంగా వ్యాప్తి చెందడం వల్లే కేసులు అధికంగా నమోదవుతున్నాయని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ అండ్‌ కంట్రోల్‌(ఈసీడీసీ) వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో స్వల్ప లక్షణాలే కనిపించడం కొంత ఊరట కలిగించే విషయం. కొత్త వేరియంట్లు రూపాంతరం చెంది ప్రమాదకరంగా మారితే మాత్రం ఆసుపత్రిలో చేరికలు, మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉండొచ్చని ఈసీడీసీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని