Updated : 01 Jul 2022 18:04 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ప్రాజెక్టుల పేరుతో అరాచకాలా?: సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

ప్రాజెక్టులు, సాగునీరు పేరుతో తెరాస అరాచకాలు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల పేరిట వందల కోట్లు వెచ్చించి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పరిహారం అడిగిన నిర్వాసితులపై లాఠీఛార్జ్ చేసి, చేతులకు బేడీలు వేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ ఖమ్మంలో ఆదివాసీ మిర్చి రైతులకు సంకెళ్లు వేశారని, సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయడం సమంజసమా?అని ప్రశ్నించారు.

భాజపా, కాంగ్రెస్‌ శ్రేణులపై లాఠీఛార్జి.. హనుమకొండలో ఉద్రిక్తత

2. ఈ ఏడాది అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

గత రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలపై ఈవో ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈసారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు.

అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు

3. నాకు ద్రోహం చేసినట్టు ముంబయికి చేయకండి: ఉద్ధవ్‌ ఠాక్రే

మెట్రో కార్‌షెడ్‌పై గత ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కనబెట్టి.. ఆ ప్రాజెక్టును తిరిగి ఆరే కాలనీలోనే నిర్మించాలని మహారాష్ట్రలో కొత్తగా కొలువుదీరిన శిందే సర్కార్‌ నిర్ణయించడం విచారకరమని శివసేన అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. తనపై ఉన్న కోపాన్ని ముంబయి ప్రజలపై ప్రదర్శించొద్దన్నారు. సీఎంగా రాజీనామా చేసిన తర్వాత తొలిసారి ఆయన శివసేన భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 

4. మా కార్పొరేటర్లను భయపెట్టి తెరాసలో చేర్చుకున్నారు: బండి సంజయ్‌

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెరాస ప్రభుత్వం ప్రొటోకాల్‌ పాటించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ భాజపా ఫ్లెక్సీలను అడ్డుకున్నంత మాత్రాన తమను అడ్డుకోలేరని అన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు భయపడే తమపార్టీ కార్పొరేటర్లను తెరాసలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. డబ్బుతో ప్రలోభపెట్టి, కేసులతో భయపెట్టి తెరాసలో చేర్చుకున్నారని విమర్శించారు. 

5. డ్రగ్స్‌కు ఖైరతాబాద్‌ అడ్డాగా మారింది: దాసోజు శ్రవణ్‌

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను తెరాస ప్రజాప్రతినిధులు నాశనం చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఐపీఎస్‌ అధికారులు కూడా డూడూ బసవన్న తరహాలో పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ప్రజాప్రతినిధులకు సలాం కొడుతున్నారని ఆరోపించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దాసోజ్‌ శ్రవణ్‌ మాట్లాడారు

 మహిళ ఖాతా నుంచి రూ.70 వేలు కాజేసిన వాలంటీర్!

6. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌.. భారత్‌ బ్యాటింగ్‌

టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. టీమ్‌ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా కారణంగా దూరమవ్వగా పేసర్‌ బుమ్రా జట్టు పగ్గాలు అందుకున్నాడు. 

7. నష్టాల్లో ముగిసిన సూచీలు.. 7% పతనమైన రిలయన్స్‌ షేర్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం జూన్‌ నెలకు నష్టాలతో స్వాగతం పలికిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. రిలయన్స్ వంటి దిగ్గజ షేర్ల భారీ పతనంతో సెన్సెక్స్‌ ఓ దశలో 52,094.25 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కనిష్ఠ స్థాయిల నుంచి కోలుకున్నప్పటికీ.. పూర్తిస్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి.

8.  జూన్‌లోనూ భారీగా జీఎస్‌టీ వసూళ్లు

వస్తు సేవల పన్ను (GST collections) వసూళ్లు మరోసారి భారీ ఎత్తున నమోదయ్యాయి. 2022 జూన్‌లో జీఎస్‌టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 56 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం వెల్లడించింది. మే నెల రూ.1.41 లక్షల కోట్లు వసూలవ్వగా.. జూన్‌లో అంతకుమించి పన్ను వసూళ్లు నమోదయ్యాయి.

9. మెట్రో కార్‌షెడ్‌పైనే శిందే తొలి నిర్ణయం.. మాజీ బాస్‌ నిర్ణయం పక్కకు..!

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే.. తన మాజీ బాస్‌ అయిన ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి షాకే ఇవ్వబోతున్నట్లున్నారు. మెట్రో కార్‌షెడ్‌పై ఠాక్రే నిర్ణయాన్ని పక్కనబెట్టి.. ఆ ప్రాజెక్టును తిరిగి ఆరే కాలనీలోనే నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం రాత్రి జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో సీఎం శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆ దిశగా చర్యలు చేపట్టారు.

10. విదేశీ వస్తువులను తాకడం వల్లే.. మా దేశంలో కరోనా..!

తమ దేశంలో కొవిడ్(Covid-19) వ్యాప్తికి విదేశీ వస్తువులు కారణమంటూ దక్షిణ కొరియా(South Korea)పై ఉత్తర కొరియా(North Korea) నిందలు వేసింది. విదేశీ వస్తువులు తాకడం వల్లే తమవద్ద మొదటిసారి కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైందని ఆరోపించింది. తమ ఆరోపణలు నిరూపించే విధంగా దర్యాప్తు వివరాలను ప్రకటించింది. ‘ఉత్తర కొరియా ప్రజలు సరిహద్దుల వెంట గాలి, వాతావరణం, బెలూన్ల ద్వారా వచ్చే విదేశీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts