Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 09 Mar 2024 21:01 IST

1. చంద్రబాబు, పవన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: జేపీ నడ్డా

ఎన్డీఏలో చేరాలన్న తెదేపా, జనసేన పార్టీల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘ఎక్స్‌’(ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘దేశాభివృద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల మేలు కోసం కలిసి పనిచేస్తాం’’ అని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఈ నెల 17న ఒకే వేదికపైకి ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌?

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో సభా స్థలాన్ని శనివారం తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరి సాంబశివరావు, దామచర్ల సత్య, వేపాడ చిరంజీవిరావు, పెందుర్తి వెంకటేశ్‌, చదలవాడ అరవిందబాబు, జనసేన నేతలు గాదె వెంకటేశ్వరరావు, రాజా రమేశ్‌ పరిశీలించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అభివృద్ధిని అడ్డుకుంటే.. నగర బహిష్కరణే: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కొందరు అడ్డుపడుతున్నారని, అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బైరామల్‌గూడ జంక్షన్‌లో రూ.148.05 కోట్లతో నిర్మించిన లెవల్‌ -2 ఫ్లైఓవర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సేనా.. సిద్ధం అన్నోళ్లకి ఈసారి మర్చిపోలేని యుద్ధం: నాగబాబు

ఆలోచించాల్సిన సమయం కాదిది.. నాయకుడి ఆదేశాలని‌ ఆచరణలో పెట్టాల్సిన సమయమని జనసేన శ్రేణులకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. ‘‘సందిగ్ధాల సమయం కాదిది.. సమరానికి సిద్ధం కావాల్సిన సమయం. సేనా.. సిద్ధం సిద్ధం అన్నోళ్లకి ఈసారి ఇద్దాం మర్చిపోలేని యుద్ధం’’ అని పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కాళేశ్వరంపై ముగిసిన ఎన్డీఎస్ఏ కమిటీ పరిశీలన.. ఇంజినీర్లపై ఆగ్రహం

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఏర్పాటైన జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కమిటీ రాష్ట్ర పర్యటన ముగిసింది. చివరి రోజైన శనివారం హైదరాబాద్‌ జలసౌధలో నీటిపారుదలశాఖ అధికారులు, ఆయా విభాగాల వారీగా ఇంజినీర్లతో విడివిడిగా కమిటీ సమావేశమైంది. ఏజెన్సీల ప్రతినిధులతోనూ చర్చించి అవసరమైన సమాచారం తీసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ లేఖ

ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) అమలు చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నా రిటైర్మెంట్ అప్పుడే.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖండించాడు. ఎప్పుడైతే తాను సరిగ్గా ఆడటం లేదని అర్థమవుతుందో అప్పుడు వెంటనే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని పేర్కొన్నాడు. అయితే.. కొన్నాళ్లుగా తాను అద్భుతంగా ఆడుతున్నానని రోహిత్ వివరించాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కులగణనతో రిజర్వేషన్లపై పరిమితి ఎత్తి వేయొచ్చు: రాహుల్‌

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మరోసారి స్పష్టం చేశారు. కులగణనతో పాటు ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ ద్వారా ఇప్పటివరకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయొచ్చన్నారు. పేదల కోసం సరైన విధానాలు, ప్రణాళికలను రూపొందించడమే కాక విద్య, వైద్యం ఇలా అనేక రంగాల్లో అభివృద్ధికి సహాయపడుతుందని పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సోనియాగాంధీ, లాలూ లక్ష్యాలివే: అమిత్‌ షా

కాంగ్రెస్(Congress), ఆర్జేడీ(RJD) అగ్ర నాయకులు తమ కుటుంబాల ఎదుగుదల కోసమే పాటుపడ్డారని, పేదల కోసం ఏమీ చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా(Amit Shah) దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, భాజపా మాత్రమే పేదలకు మంచి చేయగలవన్నారు. శనివారం బిహార్‌లో పర్యటించిన ఆయన భాజపా ఓబీసీ మోర్చా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నిద్రపోయిన పైలట్లు.. దారి తప్పిన విమానం..!

విధుల్లో ఉన్న ఇద్దరు పైలట్లు ఒకే సమయంలో నిద్ర పోవడంతో ఓ విమానం దారితప్పింది. ఇండోనేషియా (Indonesia)లో ఈ ఘటన వెలుగు చూసింది. దాదాపు అరగంట తర్వాత ప్రధాన పైలట్ మేల్కొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు ఇండోనేషియా రవాణా శాఖ తాజాగా వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని