Rohit Sharma: నా రిటైర్మెంట్ అప్పుడే.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

తన రిటైర్మెంట్ గురించి టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. 

Published : 10 Mar 2024 00:35 IST

ఇంటర్నెట్ డెస్క్: తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖండించాడు. ఎప్పుడైతే తాను సరిగ్గా ఆడటం లేదని అర్థమవుతుందో అప్పుడు వెంటనే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని పేర్కొన్నాడు. అయితే.. కొన్నాళ్లుగా తాను అద్భుతంగా ఆడుతున్నానని రోహిత్ వివరించాడు. జియో సినిమా ప్రీ-రికార్డెడ్‌ ఇంటర్వ్యూలో టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్ దినేశ్ కార్తిక్‌తో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్‌ సారథ్యంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో రోహిత్ కెప్టెన్‌గా, ఆటగాడిగా రాణించాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టు, ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో సెంచరీలు బాదాడు. 

‘‘నేను సరిగ్గా ఆడటం లేదని భావించినప్పుడు ఆ విషయాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు వివరించి రిటైర్‌ అవుతా. కానీ, నిజాయతీగా చెప్పాలంటే గత రెండు, మూడేళ్లుగా నా ఆట మరింత మెరుగైంది. అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తున్నా. నేను గణాంకాలు, రికార్డుల గురించి పెద్దగా పట్టించుకునే వ్యక్తిని కాదు. భారీ స్కోరులు చేయడం ముఖ్యమే. కానీ, జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడటంపై దృష్టిపెట్టాను. నేను కొంత మార్పు తీసుకురావాలనుకున్నాను. ఆటగాళ్లు చాలా స్వేచ్ఛగా ఆడటం మీరు చూస్తున్నారు. వ్యక్తిగత స్కోర్లు ముఖ్యం కాదు. నిర్భయంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకుని బాగా ఆడితే పరుగులు వాటంతటవే వస్తాయి’’ అని రోహిత్‌ శర్మ వివరించాడు. 

రోహిత్‌ వ్యాఖ్యలను బట్టి అతడు ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించడని అర్థమవుతోంది. దీంతో అతడి ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్‌ తప్పకుండా ఆడతాడని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని