AP News: కవలలు.. కలిసి సాధించారు!

పదేళ్ల కల.. నాలుగేళ్ల పట్టుదల.. ఎనిమిది నెలల కఠోర శ్రమ.. ఫలితం రూ.50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.

Updated : 26 Jun 2021 13:19 IST

రూ.50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం 
పొందిన ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు

ఈనాడు, అమరావతి: పదేళ్ల కల.. నాలుగేళ్ల పట్టుదల.. ఎనిమిది నెలల కఠోర శ్రమ.. ఫలితం రూ.50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం. ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం మొదటి బ్యాచ్‌కు చెందిన కవల సోదరులు సాధించిన ఘనత ఇది. 
ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్‌ సైన్సు విద్యార్థులు సప్తర్షి మజుందర్, రాజర్షి మజుందర్‌ ఏడాదికి రూ.50లక్షల చొప్పున వేతన ప్యాకేజీతో ఉద్యోగం పొందారు. గూగుల్‌ జపాన్‌ భాగస్వామ్య సంస్థ పీవీపీ ఐఎన్‌సీ నిర్వహించిన మూడు రౌండ్ల పరీక్షల్లో నెగ్గి ఈ ప్యాకేజీని అందుకున్నారు. ఈ కవల సోదరులకు గేమింగ్‌ డెవలప్‌మెంట్‌ అంటే ఎంతో ఆసక్తి. కంప్యూటర్‌ గేమ్స్‌లో పరిశోధనలు చేయాలనేది వీరి ఆలోచన. జపాన్‌ వెళ్లాలనేది చిన్నతనం నుంచి ఉన్న స్వప్నం. దాంతో 8 నెలలపాటు రోజుకు 6 గంటలు కష్టపడి జపనీస్‌ నేర్చుకున్నారు. జపాన్‌ వెళ్లాలనే లక్ష్యం కోసం ఇతర కంపెనీల ఉద్యోగాలూ వదులుకున్నారు. కరోనా కారణంగా జపాన్‌లో గేమ్స్‌ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు తగ్గాయి. ఆ దేశం వెళ్లేందుకు తమ ఇష్టమైన గేమింగ్‌లో కాకుండా గూగుల్‌ క్లౌడ్, డేటాబేస్‌పై పని చేసేందుకు సిద్ధమై.. ఆ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యారు. వీరి కష్టపడేతత్వాన్ని గుర్తించిన కంపెనీ ప్రతినిధులు గూగుల్‌ క్లౌడ్, డేటాబేస్‌పై పని చేసేందుకు ఉద్యోగానికి ఎంపిక చేసుకున్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన వీరి తండ్రి భిశ్వజిత్‌ జార్ఖండ్‌లో ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ‘ప్రస్తుతం ఉద్యోగంలో చేరినా ఎప్పటికైనా గేమింగ్‌లో స్టార్టప్‌ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం. మొదట లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దాని కోసం చివరి వరకు కష్టపడాలి. అప్పుడే అనుకున్న ఫలితం వస్తుంది’ అని ఈ కవల సోదరులు సూచిస్తున్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని