Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్‌ఇండియా!

ఎయిర్‌ఇండియా (Air India) విమానంలో ప్రయాణిస్తోన్న ఓ మహిళా ప్రయాణికురాలి (passenger)పై సిబ్బందిలో ఒకరు పొరపాటున వేడి నీళ్లు వొలకపోయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా సదరు ప్రయాణికురాలికి క్షమాపణలు చెప్పింది. 

Published : 30 Sep 2023 01:54 IST

దిల్లీ: ఎయిర్‌ఇండియా (Air India) విమానంలో ప్రయాణిస్తోన్న ఓ మహిళా ప్రయాణికురాలి (passenger)పై సిబ్బందిలో ఒకరు పొరపాటున వేడి నీళ్లు వొలకపోయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వైద్యం చేసేందుకు విమానంలో సరైన ప్రాథమిక చికిత్స కిట్‌ కూడా లేకపోవడంతో నొప్పితో రెండు గంటలపాటు నరకం చూసింది. కొన్ని రోజుల కిందట ఈ ఘటన జరగగా.. బాధితురాలు ఎయిర్‌ఇండియా విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ తాజాగా సోషల్‌మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. దీనిపై ఎయిర్‌లైన్‌ సంస్థ స్పందించి క్షమాపణలు చెప్పింది. అయితే ఎయిర్‌ ఇండియా మాత్రం ప్రయాణికురాలిపై కాఫీ పడ్డట్లు పేర్కొంది.    

‘‘నా నాలుగేళ్ల కుమారుడు, అత్తయ్యతో కలిసి దిల్లీ (Delhi) నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco)కి ఎయిర్‌ఇండియా విమానంలో వెళ్లాను. అయితే ప్రయాణంలో ఉండగా సిబ్బందిలో ఒకరు నాపై పొరపాటున వేడి నీళ్లు పోశారు. భరించలేని నొప్పితో బిగ్గరగా ఏడ్చేశాను. ప్రయాణికుల్లో ఓ ఫీజియన్‌ ఉండటంతో ఆయన నాకు కాస్త వైద్య సహాయం అందించారు. సెకండ్‌ డిగ్రీ గాయాలు అయినట్లు చెప్పారు. సిబ్బంది వద్ద తగిన ప్రాథమిక చికిత్స కిట్‌ కూడా లేదు. దీంతో ఆ నొప్పితోనే రెండు గంటలపాటు ప్రయాణించి నరకం అనుభవించాను’’అని ఆ మహిళ పోస్టులో పేర్కొన్నారు. విమానం దిగగానే పారమెడిక్‌ సిబ్బంది తనని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. విమాన సిబ్బంది తన కుటుంబసభ్యులను ఎయిర్‌పోర్టులోనే వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తోటి ప్రయాణికుడు సాయం చేయడంతో తన సోదరుడు వారిని తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆమె ఎయిర్‌లైన్‌ సంస్థకు సూచించారు. ఈ పోస్టు కాస్త వైరల్‌ కావడంతో ఎయిర్‌ ఇండియా సంస్థ స్పందించింది. 

‘ప్రయాణికులురాలిపై కాఫీ పడటంతో గాయాలవడం బాధకరం. దీనికి మేం క్షమాపణలు చెబుతున్నాం. ఘటన జరిగినప్పుడు విమానలోని సిబ్బంది వెంటనే స్పందించారు. మీకు అవసరమైన వైద్య సహాయం కోసం మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ.. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం. మా సిబ్బందికి మరింత నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం’ అని ఎయిర్‌ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని