Diamonds: రెండు రోజుల్లో 15 వజ్రాలు దొరికాయ్‌.. వేలం వేస్తే ఎంత ధర పలుకుతాయో తెలుసా?

వేర్వేరు గనుల్లో పెద్ద సంఖ్యలో వజ్రాలు దొరికాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అక్కడి కూలీలు/ప్రజలకు 15 వజ్రాలు లభ్యమైనట్టు గనుల శాఖ అధికారులు వెల్లడించారు.......

Published : 30 Sep 2022 16:18 IST

పన్నా: మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతం పన్నాలో వజ్రాల(Diamonds) పంట పండింది. అక్కడి వేర్వేరు గనుల్లో పెద్ద సంఖ్యలో బయటపడిన వజ్రాలు పలువురిని అదృష్టవంతుల్ని చేశాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అక్కడి కూలీలు/స్థానికులకు 15 వజ్రాలు దొరికినట్టు గనుల శాఖ అధికారులు వెల్లడించారు. వీటి మొత్తం బరువు 35.86 క్యారెట్లు ఉంటుందని.. వేలంలో ధర రూ.కోటి దాకా పలకవచ్చని తెలిపారు. ప్రకాశ్‌ మజుందార్‌ అనే కూలీకి బుధవారం జరువాపార్‌ గనుల్లో 3.64 క్యారెట్ల వజ్రం దొరికినట్టు గనుల శాఖ ఇన్‌స్పెక్టర్‌ అనుపమ్‌ సింగ్‌ వెల్లడించారు. అలాగే, కృష్ణకల్యాణ్‌పూర్‌ పాటి గనుల్లో కల్లు సోంకార్‌కు 6.81 క్యారెట్ల వజ్రం, రాజేశ్ జైన్‌కు 2.28 క్యారెట్లు, రాహుల్ అగర్వాల్‌కు 4.35 క్యారెట్లు, రాజాబాయ్‌ రైక్వార్‌కు 1.77 క్యారెట్ల చొప్పున వజ్రాలు దొరికాయన్నారు.

ఒకే వ్యక్తికి ఆరు వజ్రాలు దొరికాయ్‌..

మరోవైపు, గురువారం కృష్ణకల్యాణ్‌పూర్‌ పాటిలోని గనుల నుంచి పలు రకాల బరువు కలిగిన 10 వజ్రాలను అక్కడి స్థానికులు వెలికి తీసినట్టు వివరించారు. 2.46 క్యారెట్ల బరువున్న ఆరు వజ్రాలు దొరకడంతో డుక్‌మన్‌ అహిర్వార్ అనే వ్యక్తి అదృష్టవంతుడిగా నిలిచాడని వెల్లడించారు. అలాగే, అశోక్ ఖరే అనే వ్యక్తి 6.37 క్యారెట్ల బరువున్న రెండు వజ్రాలు వెలికితీయగా.. జగన్ జాడియా 4.74 క్యారెట్లు, లఖన్ కేవత్‌ అనే వ్యక్తి 3.47 క్యారెట్ల డైమండ్‌ కనుగొన్నారని తెలిపారు. ఈ విలువైన వజ్రాలను డైమండ్‌ కార్యాలయంలో డిపాజిట్‌ చేశారని.. అక్టోబర్‌ 18న వేలం వేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ముడి వజ్రాలకు వేలంలో వచ్చిన మొత్తంలో ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఈ వజ్రాలు దొరికిన వ్యక్తులకు అందజేస్తామని అధికారులు స్పష్టంచేశారు. పన్నా ప్రాంతం వజ్రాలకు ప్రఖ్యాతిగాంచిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని