5 prisoners Obama exchanged: ఆ అమెరికా సైనికుడి తప్పే ఈ ‘తాలిబన్‌ ఫైవ్‌’..!

అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వంలో తాలిబన్లు అన్ని వర్గాలను చేర్చుకొంటాము అని చెబితే ప్రపంచం నమ్మింది. తీరా ప్రభుత్వం ఏర్పాటు చేశాక చూస్తే.. తాలిబన్ల దృష్టిలో ‘అన్ని వర్గాలు’ అనే దానికి అర్థం వేరని తెలుస్తోంది.

Updated : 09 Sep 2021 13:30 IST

 నాడు అధ్యక్షుడు అప్పగించిన ఖైదీలకు కీలక పదవులు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాలను చేర్చుకుంటాము అని తాలిబన్లు చెబితే ప్రపంచం నమ్మింది. తీరా ప్రభుత్వం ఏర్పాటు చేశాక చూస్తే.. తాలిబన్ల దృష్టిలో ‘అన్ని వర్గాలు’ అనే దానికి అర్థం వేరని తెలుస్తోంది. ఈ ప్రభుత్వంలో ఉగ్రవాదులు, కిడ్నాపర్లు, హత్యలను ప్రోత్సహించిన వారు, భీకరమైన జైళ్లలో ఏళ్లకేళ్లు కాలక్షేపం చేసిన వారందరికి సముచిత స్థానాలు దక్కాయి. వీరిలో ‘తాలిబన్‌ ఫైవ్‌’గా పేరున్న ఐదుగురు క్రూరమైన నాయకులకు కీలక పదవులు కట్టబెట్టారు. ఒకప్పుడు అమెరికాను బెదిరించి వీరిని గ్వాంటనామోబే జైలు నుంచి అఫ్గాన్‌ తెప్పించారు. 

ఎవరీ ‘తాలిబన్‌ ఫైవ్‌’ బ్యాచ్‌..!

తాలిబన్‌ కొత్త ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ హక్‌ వాసిక్‌, బోర్డర్‌ అండ్‌ ట్రైబల్‌ అఫైర్స్‌ మినిస్టర్‌ నూరుల్లా నూర్‌, డిప్యూటీ డిఫెన్స్‌ మినిస్టర్‌ మహమ్మద్‌ ఫాజీ, సాంస్కృతిక సమాచార మంత్రి ఖైరుల్లా ఖైరాహ్‌తోపాటు తూర్పు కొహెస్త్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌గా నియమితులైన మహమ్మద్‌ నబీ ఒమర్‌ను కలిపి ‘తాలిబన్‌ ఫైవ్‌’గా పిలుస్తారు. వాసిక్‌, ఫాజీ, ఖైరాహ్‌ గతంలో కూడా తాలిబన్‌ ప్రభుత్వంలో పనిచేశారు.

వీరి క్రూరత్వాన్ని చెప్పిన గ్వాంటనామోబే నివేదిక

గ్వాంటనామోబే జైలు అధికారులు 2008లో వీరి నేరచరిత్రను విశ్లేషిస్తూ పై అధికారులకు నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత వికీలీక్స్‌ దీనిని బహిర్గతం చేసింది. 

 * తాలిబన్ల తొలిపాలనలో డిప్యూటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా వాసిక్‌ పనిచేశారు. అప్పట్లో తన ఆఫీస్‌ను అల్‌ఖైదాకు సహకరించేందుకు వినియోగించారు. దీంతోపాటు తాలిబన్లను ప్రత్యర్థుల నుంచి తప్పించేందుకు, ఇతర ఇస్లామిక్‌ ఉగ్రవాద గ్రూపులను సమన్వయం చేసుకోవడానికి పనిచేశాడు. దీంతోపాటు అమెరికా-నాటో దాడులు మొదలుపెట్టిన తొలినాళ్లలో వాటిపై దాడులు చేయించాడు. 

 * ఇక ఫాజి అల్‌ఖైదా, ఇతర ఉగ్రవాదుల దాడుల్లో భాగస్వామి అయ్యాడు. 

  * ఉత్తర అఫ్గానిస్థాన్‌లో గవర్నర్‌గా ఉన్న నూర్‌ ‘మజారే ఈ షరీఫ్‌’ పట్టణంలోని హజారా, తజక్‌, ఉజ్బెక్‌ జాతుల వారిని విచక్షణారహితంగా హత్యలు చేయించాడు. దీనికి ఫాజి సహకరించాడు. 

 * తాలిబన్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఖైరుల్లా ఒకరు.1999-2001 వరకు పశ్చిమ హెరాత్‌ ప్రావిన్స్‌కు గవర్నర్‌గా వ్యవహరించారు. నల్లమందు ఈయన కనుసన్నల్లోనే సాగు చేశారు. భారీగా నల్లమందు వ్యాపారం చేసేవాడు. 2001లో అమెరికా దళాలు అఫ్గాన్‌లో ప్రవేశించాక  ఇరాన్‌తో కలిసి ఖైరుల్లా పనిచేశాడు. 

బెర్గ్‌డాల్‌ కిడ్నాప్‌తో గ్వాంటనామోబే జైలు నుంచి విడుదల..

అఫ్గానిస్థాన్‌లోని పక్తిక ప్రావిన్స్‌లో 2009 జూన్‌ 30న అమెరికా సైనికుడు సార్జెంట్‌ బొవె బెర్గ్‌డాల్‌ అదృశ్యమయ్యాడు. అతను అక్కడ విధుల్లో చేరి అప్పటి ఐదు నెలలే అయింది. గతంలో శిక్షణలో ఉన్నప్పుడు కూడా హఠాత్తుగా సైనిక క్యాంపును వదిలి వెళ్లిపోవడం, మళ్లీ కొన్నాళ్లకు రావడం అతనికి మాములే. ఈ సారి అఫ్గాన్‌లో అలానే చేసి హక్కానీ గ్రూప్‌కు దొరికాడు. అతని కిడ్నాప్‌ విషయం తెలుసుకొని అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏ పరిస్థితుల్లో అతను హక్కానీ గ్యాంగ్‌కు దొరికాడో తెలియదు. దీంతో అతన్ని విడిపించేందుకు వాషింగ్టన్‌ తీవ్ర ప్రయత్నాలు చేసింది. మరోపక్క దేశంలో అతని తల్లిదండ్రులు ‘స్టాండ్‌ విత్‌ బొవి’ పేరిట ఆందోళనలు మొదలుపెట్టారు. 2012లో అమెరికా అధికారులు కతర్‌లో తాలిబన్‌ నేతలను రహస్యంగా ముఖాముఖీ కలుసుకొన్నారు. ఆ సమయంలో ఖైదీల అప్పగింత ఒప్పందం ముందుకొచ్చింది. 2014లో కతర్‌లోని దోహాలో తాలిబన్లు కార్యాలయం తెరిచారు. ఐదుగురు తాలిబన్‌ నేతలను విడుదల చేస్తే బెర్గ్‌డాల్‌ను అప్పగించేందుకు అంగీకారం కుదిరింది. తాలిబన్‌ నేతల విడుదల విషయంపై అమెరికా కాంగ్రెస్‌కు 30 రోజుల ముందు తెలియజేయాలి. కానీ, ఒబామా సర్కారు హడావుడిలో ఈ నిబంధనను కూడా పాటించలేదు. 

హాలీవుడ్‌ సినిమాను తలపించేలా..

2014 మే 31వ తేదీన బెర్గ్‌డాల్‌ను తాలిబన్‌ సభ్యులు వదిలేశారు. ఆ అప్పగింత వీడియో హాలీవుడ్‌ సినిమాను తలపించేలా ఉంది. పాక్‌ సరిహద్దుల్లోని కొహిస్త్‌ ప్రాంతంలో చిత్రీకరించిన ఈ వీడియోలో గాల్లో యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కనిపిస్తుంది. కొన్ని డజన్ల మంది అమెరికా కమాండోలు 18 మంది తాలిబన్లను కలుసుకొన్నారు. అక్కడే ఆపి ఉన్న పికప్‌ ట్రక్‌లోని బెర్గ్‌డాల్‌ను తీసుకొని హెలికాప్టర్లలో రివ్వున ఎగిరిపోయారు. మరోవైపు ‘తాలిబన్‌ ఫైవ్‌’ బ్యాచ్‌ కతర్‌కు చేరుకొంది. 

తర్వాత న్యాయస్థానాలు బెర్గ్‌డాల్‌పై విచారణ జరిపి దోషిగా నిర్ధారించి శిక్షలు విధించాయి. బెర్గ్‌డాల్‌ ఘటన తర్వాత ఒబామాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌.. బెర్గడాల్‌ను ద్రోహిగా అభివర్ణించారు. 

ఇప్పుడు వారిలో నలుగురు అఫ్గాన్‌ తాత్కాలిక ప్రభుత్వంలో కీలక సభ్యులు అయ్యారు. ఐదో వ్యక్తి ఓ ప్రాంతానికి గవర్నర్‌గా పాలన సాగిస్తున్నాడు. యుద్ధక్షేత్రాల్లో విధినిర్వహణలో చిన్న అలసత్వం కూడా వ్యూహాత్మకంగా భారీ మూల్యం చెల్లించడానికి కారణమవుతుందనడానికి బెర్గ్‌డాల్‌ ఘటనే ఉదాహరణ. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని