Online Survey: పిల్లల్లో ఆన్‌లైన్‌ వినియోగం రోజూ మూడు గంటలకుపైనే!

చాలామంది తమకు తెలియకుండానే సోషల్‌ మీడియా, వీడియోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇదే విషయంపై ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ‘లోకల్‌ సర్కిల్స్‌’ నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికర అంశాలు బయపడ్డాయి.

Published : 03 Dec 2022 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంతకాలంగా దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. మొబైల్‌ సేవలు అందరికి చేరువయ్యాయి! ఈ క్రమంలోనే.. చాలామంది తమకు తెలియకుండానే సోషల్‌ మీడియా, వీడియోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇదే విషయంపై ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ‘లోకల్‌ సర్కిల్స్‌’ నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు దేశంలోని 287 జిల్లాల్లో సర్వే నిర్వహించి 65 వేలకుపైగా సమాధానాలను విశ్లేషించి తుది నివేదికను రూపొందించారు.

సర్వేలోని కీలక అంశాలు..

* 9-17 ఏళ్ల మధ్య ఉన్న తమ పిల్లలు వీడియోలు, ఆన్‌లైన్‌ గేమింగ్, సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారారని దాదాపు 40 శాతం మంది పట్టణ ప్రాంత తల్లిదండ్రులు వెల్లడించారు. రోజూ మూడు గంటలు వాటికే కేటాయిస్తున్నట్లు తెలిపారు.

13-17 ఏళ్లలోపువారు రోజూ మూడు గంటలకుపైగా నెట్టింట్లో ఉంటున్నట్లు 62 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు. 9-13 ఏళ్లలోపు ఉన్న తమ పిల్లలు అంతే సమయం గడుపుతున్నట్లు 49 శాతం మంది వెల్లడించారు.

తమ 9- 13 ఏళ్ల పిల్లలు మరీ ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్లకు అతుక్కుపోయారని 47శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. 13-17 ఏళ్లలోపు పిల్లలదీ ఇదే పరిస్థితి అని 44శాతం మంది తెలిపారు.

సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్‌ చేసేందుకు కనీస వయస్సును 13 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచాలని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చాలావరకు సోషల్ మీడియా, ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫాంలలో అకౌంట్‌ తెరిచేందుకు కనీస వయస్సు 13 ఏళ్లుగా ఉంది.

‘ఇది ఆందోళనకర ధోరణి..’

‘ప్రస్తుతం చాలా వరకు సమాచారం ఆన్‌లైన్‌గా మారింది. వీడియో కంటెంట్‌ వృద్ధి చెందుతోంది. గేమింగ్, సోషల్ మీడియాలోనూ ఇవి లభ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. చాలా మంది పట్టణ ప్రాంత పిల్లలు తమ చదువులు, వినోదం కోసం వీటిని ఆశ్రయిస్తున్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ చదువుల కోసం.. ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిన కారణంగా ఈ సమస్య ఇంకా తీవ్రరూపం దాల్చింది. ఇది ఆందోళనకర ధోరణి. ప్రభుత్వం, తల్లిదండ్రులు, పాఠశాలలు పరస్పర సమన్వయంతో పరిస్థితులను చక్కదిద్దాలి’ అని సర్వే సంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని