భారత్‌లో 700దాటిన కరోనా మరణాలు!

భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1684 పాజిటివ్‌ కేసులు నమోదవడంతోపాటు 37మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,393కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

Updated : 24 Apr 2020 10:34 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1684 పాజిటివ్‌ కేసులు నమోదవడంతోపాటు 37మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,077కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్‌ సోకి ఇప్పటివరకు 718మంది మృత్యువాతపడ్డారు. మొత్తం బాధితుల్లో 4749మంది కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 17,610మంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి కోలుకుంటున్నవారి శాతం 19.89గా ఉందని ప్రభుత్వం తెలిపింది. గతకొన్ని రోజులుగా ఈ వైరస్‌ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం ఊరటనిస్తోంది.

మహారాష్ట్రలో విలయతాండవం..

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 778పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6427కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 283 ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా దేశఆర్థిక రాజధాని ముంబయిలో దీని తీవ్రత అధికంగా ఉంది. గురువారంనాడు నగరంలో 522 కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ముంబయిలోనే కరోనా బాధితుల సంఖ్య 4025 చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు నగరంలో కరోనాబారినపడి 167మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 

ధారవిలో ఆందోళనకరం..

ముంబయి మురికివాడ ధారవిలో కరోనా తీవ్రత కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 214పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 13మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికే దీన్ని కేంద్రప్రభుత్వం హాట్‌స్పాట్‌గా ప్రకటించింది. దీంతో బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ ఇప్పటివరకు 813 కంటైన్మెంట్‌ జోన్లను ప్రకటించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా తాజాగా కేంద్ర ఆరోగ్య బృందాలు మహారాష్ట్రలో పర్యటించి పరిస్థితి సమీక్షించాయి. లాక్‌డౌన్‌ నిబంధనలను పటిష్టంగా అమలుచేయడంతోపాటు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులకు సూచనలు ఇచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య రెట్టింపునకు 7రోజులు పడుతున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. 

ఇక గుజరాత్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక్కడ ఈ వైరస్‌ బారినపడి 112మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 2624కి చేరింది. దిల్లీలోనూ కరోనా వైరస్‌తో మొత్తం 50మంది మరణించగా బాధితుల సంఖ్య 2376గా ఉంది. మధ్యప్రదేశ్‌లోనూ కరోనాతో మరణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు ఇక్కడ కరోనాతో 83మంది మరణించారు. రాజస్థాన్‌లో ఇప్పటివరకు 1964 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.  

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 80మంది కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 895కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో 27మంది మరణించారు. ఇక తెలంగాణలో నిన్న 27కేసులు నిర్ధారణ కాగా మొత్తం కేసుల సంఖ్య 970కి చేరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వైరస్‌ బారినపడి 25మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి..

అమెరికాలో ఉపశమన ఛాయలు..

చైనా నవంబరులోనే వైరస్‌ను గుర్తించిందా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని