బెంగళూరులో ఎన్‌ఐఏ కార్యాలయం పెట్టండి: ఎంపీ

ఉగ్ర కార్యకలాపాలకు బెంగళూరు స్థావరంగా మారిందని భాజపా ఎంపీ తేజస్వి సూర్య ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను బెంగళూరులో ఏర్పాటు చేయాలని...

Updated : 29 Sep 2020 14:49 IST

ఉగ్ర కార్యకలాపాలకు ‘ఇన్‌క్యుబేషన్‌‌ సెంటర్‌’గా మారింది

బెంగళూరు సౌత్‌ ఎంపీ తేజస్వి సూర్య ఆందోళన

బెంగళూరు: ఉగ్రవాద కార్యకలాపాలకు బెంగళూరు స్థావరంగా మారిందని భాజపా ఎంపీ తేజస్వి సూర్య ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను బెంగళూరులో ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కోరినట్లు ఎంపీ తెలిపారు. భారత్‌ సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఇటీవల స్లీపర్‌సెల్‌ ఉగ్ర దళాలను పోలీసులు భగ్నం చేశారని వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలు తమ ఉగ్రవాద కార్యకలాపాల కోసం బెంగళూరును ‘ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌’గా తయారు చేసుకున్నాయని పేర్కొన్నారు. భాజపా యువ మోర్చా అధ్యక్షుడిగా తేజస్వి సూర్య నిన్ననే ఎంపికైన విషయం తెలిసిందే. 

కర్ణాటకలో ఉగ్రవాద కార్యక్రమాలను అడ్డుకోవడానికి మంచి వసతులు, తగిన సిబ్బందితో ఎన్‌ఐఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ తేజస్వి సూర్య వెల్లడించారు. దీనికి అమిత్ షా సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే ఎస్పీ కేడర్‌ స్థాయి అధికారిని నియమించి శాశ్వతంగా కార్యాలయం ఏర్పాటు చేసేలా అధికారులకు సూచిస్తానని అమిత్‌ షా చెప్పారని బెంగళూరు సౌత్‌ ఎంపీ తేజస్వి సూర్య తెలిపారు. యువమోర్చా అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా యువతను భాజపా వైపు వచ్చేలా కృషి చేస్తానని తేజస్వి చెప్పారు. ఓ సామాన్య కార్యకర్తను యువ మోర్చా అధ్యక్షుడిగా చేయడం కేవలం భాజపాలోనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. సమాజంలో బలమైన నాయకులు బలహీనవర్గాల నుంచే వస్తారనేదానికి ఇదొక ఉదాహరణ అని తేజస్వి సూర్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని