JK కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా మనోజ్‌ సిన్హా 

జమ్మూకశ్మీర్‌కు కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మనోజ్‌ సిన్హా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న గిరీష్‌ చంద్ర.........

Published : 06 Aug 2020 18:04 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మనోజ్‌ సిన్హా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న గిరీష్‌ చంద్ర ముర్ము తన పదవికి బుధవారం రాజీనామా చేయడంతో కొత్త గవర్నర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం నియమించారు.

61 ఏళ్ల మనోజ్‌ సిన్హా భాజపాలోని కీలక జాతీయ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నారు. మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయానికి సరిగ్గా ఏడాది పూర్తయిన నేపథ్యంలో సిన్హా నియామకం అక్కడ రాజకీయ ప్రక్రియను పునరుద్ధరించే చర్యగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రానున్న రోజుల్లో శ్రీనగర్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మరోవైపు, గిరీష్‌ చంద్ర ముర్ము భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)గా నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాజీవ్‌ మెహెర్షి ఈ వారంలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో ముర్మును నియమించినట్లు తెలుస్తోంది. 1985 బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ముర్ము.. కేంద్ర ఆర్థిక శాఖలో వ్యయ విభాగం కార్యదర్శిగా పదవీ విరమణ చేయకముందే జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని