కొవిడ్‌ టీకా: వినియోగం కోసం ఫైజర్‌ దరఖాస్తు!

ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన టీకా అత్యవసర వినియోగానికి అనుమతించాలని నియంత్రణ సంస్థలను కోరనున్నట్లు ప్రకటించాయి.

Published : 20 Nov 2020 19:38 IST

అమెరికా ఎఫ్‌డీఏకు నివేదిస్తున్నట్లు ప్రకటన

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తెచ్చేందుకు వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన టీకా అత్యవసర వినియోగానికి అనుమతించాలని నియంత్రణ సంస్థలను కోరనున్నట్లు ప్రకటించాయి. ఇందుకు కావాల్సిన నివేదికను సిద్ధం చేసి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)కు అందజేస్తున్నట్లు పేర్కొన్నాయి.

మూడో దశ ప్రయోగాల్లో తాము అభివృద్ధి చేసిన టీకా 95శాతం సమర్థత కలిగినట్లు ఫైజర్‌ ఈ మధ్యే వెల్లడించింది. ప్రయోగాల్లో ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు తలెత్తలేదని స్పష్టంచేసింది. అందుకే వీటిని అత్యవసర వినియోగం కింద, వైరస్‌ సోకే ప్రమాదమున్న వారికి తొలుత అందించేందుకు అనుమతించాలని ఎఫ్‌డీఏను కోరుతున్నామని పేర్కొంది. ఈ టీకాలను తొలుత అమెరికాలో డిసెంబర్‌ నెలలోనే ఇవ్వడానికి సిద్ధమైనట్లు వెల్లడించింది. టీకా పనితీరుకు సంబంధించిన పూర్తి విశ్లేషణ సమాచారాన్ని నియంత్రణ సంస్థలకు అందిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. సమర్థవంతమైన, సురక్షిత వ్యాక్సిన్‌ను అందించడమే లక్ష్యంగా ఇదివరకెన్నడూ లేనంత తొందరగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని ఫైజర్‌ సీఈఓ డాక్టర్‌ ఆల్బర్ట్‌ బౌర్లా వెల్లడించారు. ‘వ్యాక్సిన్‌ సమర్థత, సురక్షితమని నిరూపించే పూర్తి సమాచారం ప్రస్తుతం మా వద్ద ఉంది. అందుకే వ్యాక్సిన్‌ పూర్తి సామర్థ్యం కలిగి ఉందని విశ్వసిస్తున్నాం. ఈ నేపథ్యంలో అనుమతి కోసం దరఖాస్తు చేయడం కీలక మైలురాయి’ అని ఆల్బర్ట్‌ బౌర్లా అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి. వీటిలో దాదాపు 11 వ్యాక్సిన్‌లు మూడోదశలో ఉండగా, వీటిలో ఫైజర్‌, మోడెర్నాలు దాదాపు 95శాతం సమర్థత కలిగినట్లు వెల్లడించాయి. తాజాగా మరో ముందడుగు వేసిన ఫైజర్‌, అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ అమెరికా ఎఫ్‌డీఏను కోరుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా అనుమతి వచ్చిన గంటల వ్యవధిలోనే వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొంది. కేవలం, అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా, కెనడా, యూరప్‌, జపాన్‌, యూకే దేశాల్లోనూ ఆయా నియంత్రణ సంస్థల అనుమతులు కోరేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని