దేశమంతా రామమయం: ప్రధాని మోదీ

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ...

Updated : 29 Nov 2023 12:10 IST

అయోధ్య: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ...జై శ్రీరామ్‌ నినాదాలతో మోదీ తన ప్రసంగం ప్రారంభించారు. 

‘‘ఈనాటి జయజయ ధ్వానాలు శ్రీరాముడికి వినిపించకపోవచ్చు కానీ, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తులకు వినిపిస్తాయి. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం నా మహద్భాగ్యం. ఈ మహద్భాగ్యాన్ని రామమందిరం ట్రస్టు నాకు కల్పించింది.  దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో నిండిపోయింది. ఈనాడు దేశమంతా రామమయమైంది. ప్రతి ఒక్కరి మనసు దేదీప్యమానమైంది. గుడి, టెంటులో ఉన్న రామమందిరం ఇకపై భవ్యమందిరంగా మారబోతోంది. విశ్వవ్యాప్తంగా జైశ్రీరామ్‌ నినాదాలు మారుమోగుతున్నాయి. రాముడు అందరి మనస్సుల్లో నిండి ఉన్నారు. శ్రీరాముడు అంటే మర్యాద పురుషోత్తముడు. అలాంటి పురుషోత్తముడికి భవ్య మందిర నిర్మాణం  ప్రారంభమైంది. రాముడి ఆదర్శాలు కలియుగంలో పాటించేందుకు మార్గమిది.ఈ మందిర నిర్మాణం జాతీయ భావన. కోట్లమంది మనో సంకల్పానికి ప్రతీక ఈ మందిరం. ఈరోజు ప్రపంచ నలుమూలలకూ శుభపరిణామం. భారత్‌ ఆదర్శాలు, దర్శన్‌లో రాముడు ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా రామనామం జపించే భక్తులు ఉన్నారు. కంబోడియా, మలేషియా, థాయ్‌లాండ్‌లో రామాయణగాథలు ప్రసిద్ధి.  శ్రీలంక, నేపాల్‌ లో రాముడు, జానకిమాత కథలు వినిపిస్తాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎందరో త్యాగాల ఫలితం. రామ మందిరం కోసం ఆత్మత్యాగం చేసిన వారికి 135 కోట్ల మంది తరఫున ధన్యవాదాలు. రాముడి ప్రేరణతో భారత్‌ ముందుకెళ్తుంది’’ అని మోదీ తెలిపారు.

ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణం శిలా ఫలకాన్ని మోదీ ఆవిష్కరించారు. రామమందిరం నిర్మాణ చిహ్నంగా పోస్టల్‌ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని