Afghanistan: అఫ్గాన్ పరిణామాలపై అరబ్ మిత్రులతో భారత్ చర్చలు
అఫ్గానిస్థాన్‌లో తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్.. తాలిబన్ల పాలనతో
త్వరలో దిల్లీకి రానున్న సౌదీ విదేశాంగ మంత్రి
ఈనాడు, దిల్లీ: అఫ్గానిస్థాన్‌లో తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్.. తాలిబన్ల పాలనతో తలెత్తే అవకాశమున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. అరబ్ ప్రపంచంలోని మిత్రదేశాలతో ఈ విషయంపై ఎప్పటికప్పుడు చర్చలు జరిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాన్, కతర్, యూఏఈలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ త్వరలోనే దిల్లీలో పర్యటించనున్నారు. భారత్‌లో ఆయన తొలి పర్యటన ఇదే కానుంది. అఫ్గాన్‌తో సౌదీకి శతాబ్దాలుగా సంబంధాలున్నాయి. తాలిబన్లతో దౌత్య సంబంధాలు పెట్టుకోవడంపై ఆ దేశం ప్రస్తుతం మౌనం పాటిస్తోంది. అయితే సమీప భవిష్యత్తులో అఫ్గాన్ పరిణామాల్లో సౌదీ కీలకంగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఫైజల్ భారత పర్యటనకు రానుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అఫ్గాన్ గడ్డపై భారత వ్యతిరేక ఉగ్రవాద ముఠాల గురించి ఆయనకు వివరిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు- ఇరాన్ కూడా త్వరలోనే తమ విదేశాంగ మంత్రిని భారత పర్యటనకు పంపనున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్ పరిణామాలపై కతర్, యూఏఈలతోనూ మన దేశం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.
పాక్ పాత్రను పరిశీలిస్తాం: బ్లింకెన్
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్‌లో గత 20 ఏళ్లలో పాకిస్థాన్ పోషించిన పాత్రను త్వరలో పరిశీలిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఆ దేశంలో పాక్ భవిష్యత్ పాత్రపైనా కన్నేసి ఉంచుతామని చెప్పారు. 9/11 దాడుల తర్వాత అఫ్గాన్‌లో పాక్ అత్యంత కుట్రపూరితంగా వ్యవహరించిందని.. దాని పాత్రపై దర్యాప్తు జరిపించాలని చట్టసభ్యులు డిమాండ్ చేసిన నేపథ్యంలో బ్లింకెన్ ఈ మేరకు ప్రకటన చేశారు. తాలిబన్లకు పాకిస్థాన్ దీర్ఘకాలం పాటు మద్దతుగా నిలిచిందంటూ కాంగ్రెస్ వేదికగా పలువురు చట్టసభ్యులు సోమవారం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సంగతి గమనార్హం. నాటోయేతర ప్రధాన మిత్రపక్షంగా ఆ దేశానికి ఉన్న హోదాను పునఃసమీక్షించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు- అఫ్గాన్‌లో ఇటీవల తరలింపు చర్యలు గందరగోళ పరిస్థితుల్లో కొనసాగాయంటూ రిపబ్లికన్ నేతలు చేసిన విమర్శలను బ్లింకెన్ తిప్పికొట్టారు. ఆ పరిస్థితులకు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
120 కోట్ల డాలర్ల సహాయం ప్రకటన
ఐరాస, జెనీవా: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్థాన్ వాసులకు అండగా నిలిచేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ఆ దేశానికి 120 కోట్ల డాలర్ల మేర సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. అఫ్గాన్‌లో మానవీయ సంక్షోభం, తాజా పరిస్థితులపై జెనీవా వేదికగా ఐక్యరాజ్య సమితి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఏడాది చివరికల్లా ఆ దేశానికి 60.6 కోట్ల డాలర్ల సహాయం అందించాలని పిలుపునివ్వగా ప్రపంచ దేశాల నుంచి అద్భుత స్పందన లభించింది. మొత్తంగా అఫ్గాన్‌కు 120 కోట్ల డాలర్ల మేర సహాయం అందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చిందని ఐరాస మానవీయ వ్యవహారాల విభాగం అండర్ సెక్రటరీ జనరల్ మార్టిన్ గ్రిఫిత్స్ తెలిపారు. వాటిలో దాదాపు 60 కోట్ల డాలర్లు ఈ ఏడాదే అఫ్గాన్‌కు సమకూరుతాయని చెప్పారు.
తాలిబన్లతో సంబంధాలు కొనసాగించాల్సిందే: గుటెరస్
తాలిబన్లతో తాము సంబంధాలు కొనసాగించనున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. అఫ్గాన్‌లో సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు అది అత్యవసరమని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా