కొలికోడ్‌: నివేదిక రాగానే దిద్దుబాటు చర్యలు

కొలికోడ్‌ విమాన ప్రమాదంపై విచారణ నివేదిక అందగానే దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఛైర్మన్‌ అరవింద్‌ సింగ్‌ అన్నారు. సహాయక చర్యలు ముగిశాయని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని వెల్లడించారు....

Published : 08 Aug 2020 17:19 IST

దిల్లీ: కొలికోడ్‌ విమాన ప్రమాదంపై విచారణ నివేదిక అందగానే దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఛైర్మన్‌ అరవింద్‌ సింగ్‌ అన్నారు. సహాయక చర్యలు ముగిశాయని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని వెల్లడించారు.

కరోనా వైరస్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వందేభారత్‌ మిషన్‌లో భాగంగా స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం రాత్రి‌ దుబాయ్‌ నుంచి కొలికోడ్‌కు వచ్చింది. వర్షం కారణంగా రన్‌వేపై నీరు నిలవడంతో విమానాన్ని సురక్షితంగా దించేందుకు పైలట్‌ దీపక్‌ సాథె రెండుసార్లు ప్రయత్నించారు. నీరు ఎక్కువగా ఉండటంతో తగిన ఘర్షణ లభించకపోవడంతో టేబుల్‌ టాప్‌ రన్‌వే మీద నుంచి విమానం కిందకు జారిపోయి రెండు ముక్కలైంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సహా 18 మంది మృతిచెందారు.

కొలికోడ్‌ ఘటనపై విమాన ప్రమాద దర్యాప్తు బృందం (ఏఏఐబీ) విచారణ చేపట్టిందని ఏఏఐ ఛైర్మన్‌ అరవింద్‌ సింగ్‌ చెప్పారు. డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (డీఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌) స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముగిశాయని పేర్కొన్నారు. ‘నివేదిక రాగానే అన్ని వివరాలు తెలుస్తాయి. మేమంతా దాని కోసమే ఎదురు చూస్తున్నాం. ఆ వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం’ అని ఆయన వెల్లడించారు.

ఈ మధ్య కాలంలో కొలికోడ్‌లో రక్షణకు సంబంధించి ఏమైన అంశాలు ఏఏఐ దృష్టికొచ్చాయా అని ప్రశ్నించగా లేదని అరవింద్‌ సమాధానం ఇచ్చారు. కొవిడ్‌-19కు ముందు కొలికోడ్‌లో 70 వరకు రాకపోకలు సాగేవన్నారు. మే25 తర్వాత దేశవాళీ విమాన ప్రయాణాలు పునరుద్ధరించాక రోజుకు 10 వరకు రాకపోకలు సాగుతున్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని