15కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి..!

కరోనా వైరస్‌ సృష్టిస్తోన్న విలయంతో వచ్చే సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 15కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ప్రపంచబ్యాంక్‌ హెచ్చరించింది.

Published : 08 Oct 2020 01:54 IST

ప్రపంచ బ్యాంక్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయంతో వచ్చే సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ప్రపంచ బ్యాంక్‌ హెచ్చరించింది. ఈ సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ అన్ని రంగాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు చేస్తున్న నేపథ్యంలోనే ‘విభిన్న ఆర్థికవ్యవస్థ’లకు సిద్ధం కావాలని ప్రపంచ దేశాలకు సూచించింది. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో మూలధనం, శ్రమ, నైపుణ్యాలతోపాటు నూతన ఆవిష్కరణలతో నూతన వ్యాపార పద్ధతులను అవలంబించాలని సూచించింది.

మధ్య ఆదాయ దేశాల్లోనే 82శాతం..

కరోనా కారణంగా ఈ ఒక్క సంవత్సరమే కొత్తగా దాదాపు 8 నుంచి 11 కోట్ల మంది తీవ్ర పేదరికంలోని వెళ్లిపోయే అవకాశం ఉంది. దీంతో 2021 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరుకుంటుందని ప్రపంచ బ్యాంక్‌ నివేదించింది. ప్రపంచ మొత్తం జనాభాలో దాదాపు 1.4 శాతం మంది తీవ్ర పేదరికంలోకి జారుకోవడానికి కరోనా వైరస్‌తోపాటు ఆర్థిక మాంద్యం కారణమవుతాయని ప్రపంచబ్యాంక్‌ అధ్యక్షుడు డేవిడ్‌ మాల్‌పాస్‌ అభిప్రాయపడ్డారు. వీటిని సమర్థంగా ఎదుర్కొని బయటపడేందుకు ఆయా దేశాలు కరోనా తర్వాత ‘విభిన్న ఆర్థిక విధానాలను’ అనుసరించాలని సూచించారు. ఇప్పటికే పేదరికంతో సతమతమవుతున్న మధ్య ఆదాయ దేశాల్లో తాజా పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తంచేసింది. కటిక పేదరికం జాడలు మధ్య ఆదాయ దేశాల్లోనే 82శాతం ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది.

భారత్‌ సమాచారం లేకపోవడం ఆటంకం..!

పేదరికం విషయంలో భారత్‌కు సంబంధించిన సమాచారం లేకపోవడం కూడా తీవ్ర ఆటంకంగా మారిందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. అత్యంత పేదలు ఎక్కువగా ఉండే భారత్‌లో ఈ సమాచారం లేకపోవడం వల్ల ప్రస్తుతం ప్రపంచ పేదరికాన్ని అంచనా వేయలేకపోతున్నామని స్పష్టంచేసింది. అయితే పేదలు ఎక్కువగా నివసించే ముంబయిలోని ధారావిలో కరోనా వైరస్‌ విజృంభణకు స్థానిక అధికారులు తీసుకున్న చర్యలను అభినందించింది. భారీ సంఖ్యలో వైద్యపరీక్షలు నిర్వహించడంతోపాటు వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని పేర్కొంది. పట్టుదల, ప్రజల భాగస్వామ్యంతోనే ధారావి ఈ విజయం సాధించిందని ప్రపంచబ్యాంక్‌ అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని