Updated : 19/08/2021 13:56 IST

Ashraf Ghani: కట్టుబట్టలతో అఫ్గాన్‌ విడిచి వెళ్లిపోయా.. ఘనీ తొలి వీడియో సందేశం

దుబాయి: అఫ్గానిస్థాన్‌లో రక్తపాతాన్ని నివారించేందుకు తనకు కన్పించిన ఏకైక మార్గం దేశాన్ని వీడడమే అని, అందుకే వెళ్లిపోయానని అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ తెలిపారు. సొంత దేశ ప్రజలు, అధికారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న నేపథ్యంలో బుధవారం ఫేస్‌బుక్‌ వేదికగా ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్నారు. అయితే, అందరూ ఆరోపిస్తున్నట్లుగా తాను బ్యాగ్‌ల నిండా డబ్బులేమీ తీసుకెళ్లలేదని, కట్టుబట్టలతో దేశాన్ని విడిచానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 

‘‘నా స్వార్థం చూసుకుని వెళ్లలేదు. దేశం మంచి కోసమే వీడాల్సి వచ్చింది. అలాగైనా ఈ రక్తపాతం, అల్లర్లు ఆగుతాయని అనుకున్నా. ప్రస్తుతం నేను ఎమిరేట్స్‌(యూఏఈ)లో ఉన్నాను. నేను మిమ్మల్ని(అఫ్గాన్‌ ప్రజలను ఉద్దేశిస్తూ) అమ్మేసి పారిపోయానని, పెద్ద మొత్తంలో డబ్బులు తరలించానని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. కానీ, అవన్నీ పూర్తిగా నిరాధారమైనవి. నేను వాటిని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను అఫ్గానిస్థాన్‌ నుంచి ఎలా వెళ్లాల్సి వచ్చిందంటే.. కనీసం నా కాళ్లకున్న చెప్పులు మార్చుకునే అవకాశం కూడా రాలేదు. తీవ్రమైన ముప్పు ఉందని నా భద్రతా సిబ్బంది చెప్పడంతో ఆలోచించుకునే అవకాశం కూడా లేకపోయింది. వెంటనే అధ్యక్ష భవనం నుంచి వెళ్లిపోయాను. కట్టుబట్టలతో ఉత్త చేతులతో వచ్చేశాను. కావాలంటే ఈ విషయాన్ని యూఏఈ కస్టమ్స్‌ అధికారులతో కూడా ధ్రువీకరించుకోవచ్చు. నేను అక్కడే ఉంటే అఫ్గాన్‌ ప్రజల కళ్లముందే ఓ అధ్యక్షుడు ఉరికి వేలాడాల్సి వచ్చేది’’ అని ఘనీ చెప్పుకొచ్చారు. 

అయితే యూఏఈలోనే ఇక్కడే ఉండిపోనని, అఫ్గాన్‌కు తిరిగి వస్తానని ఘనీ సూచనప్రాయంగా తెలిపారు. తాలిబన్లు, ప్రభుత్వ ప్రతినిధులతో తన మద్దతుదారులు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే దేశానికి వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. కాబుల్‌ను వీడిన తర్వాత ఆయన పోస్ట్‌ చేసిన తొలి వీడియో సందేశం ఇది. అంతకుముందుకు దేశం నుంచి వెళ్లిపోయిన తర్వాత ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేసిన ఆయన.. రక్తపాతం, మహా అనర్థాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 

రాజధాని కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో ఘనీ గత ఆదివారం దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆయన వెళ్లిపోయేప్పుడు దేశ ఖజానా నుంచి 160 మిలియన్ల డాలర్ల డబ్బు తస్కరించారని తజికిస్థాన్‌లోని అఫ్గానిస్థాన్‌ రాయబారి మొహమ్మద్‌ జహీర్‌ అఘ్‌బార్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఘనీ పెద్ద ఎత్తున డబ్బుతో పరారైనట్లు రష్యా కూడా అరోపించింది. ఇదిలా ఉండగా.. ఘనీ, ఆయన కుటుంబసభ్యులను మానవతా దృక్పథంతో తమ దేశంలోకి అనుమతించినట్లు యూఏఈ నిన్న పేర్కొంది. 


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని