Mussorie: ముస్సోరీలో వెంటనే అధ్యయనం చేయండి: గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశం

జోషీమఠ్‌లోని పరిస్థితులు ముస్సోరీలోనూ ఉన్నాయేమో వెంటనే అధ్యయనం చేయాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశించింది.

Published : 03 Feb 2023 00:57 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో ఏర్పడిన పగుళ్లు ఇటీవల దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టించిన నేపథ్యంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్నఎన్జీటీ ధర్మాసనం.. అలాంటి పరిస్థితులు ముస్సోరీలోనూ ఉన్నాయేమో అత్యవసరంగా అధ్యయనం చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించేలా ఉత్తరాఖండ్‌ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 9 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, ఏసీఎస్‌ ఎన్విరాన్‌మెంట్‌, వాడియా ఇన్‌స్టిట్యూట్‌, గోవింద్‌ బల్లాబ్‌ పంత్‌ నేషనల్‌ ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ, స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ రాక్‌ మెకానిక్స్‌ తదితర సంస్థలను సభ్యులుగా చేర్చింది. జోషీమఠ్‌ తరహాలోనే ముస్సోరీలో కూడా భవన నిర్మాణాలపై నియంత్రణ లేకపోవడంతో తక్షణమే చర్యలు చేపట్టాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది.  పర్యావరణ పరిరక్షణ కోసం హిమాలయ ప్రాంతంలోని కీలక ప్రదేశాలపై సమగ్ర అధ్యయనం తప్పనిసరి అని జస్టిస్‌ ఏకే గోయల్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

భవన నిర్మాణాలకు ముస్సోరీ నేల అనువైనదా? కాదా? ఎంత మేర నిర్మాణాలు చేపట్టొచ్చు?పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్‌ తదితర అంశాలపై రెండు నెలల్లోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని తొమ్మిదిమంది సభ్యుల కమిటీని గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఎలాంటి చర్యలు తీసుకుంటే పర్యావరణానికి విఘాతం కలుగకుండా ఉంటుందో తమ నివేదికలో పొందుపరచాలని కోరింది. పరిశోధనలో భాగంగా నిపుణుల, పర్యావరణ సంస్థల అభిప్రాయాలను కూడా తీసుకొవచ్చని చెప్పిన ధర్మాసనం దీని కోసం రెండు వారాల గడువు విధించింది. రెండు నెలల్లో అధ్యయనం చేసి ఏప్రిల్‌ 30 నాటికి నివేదికను సమర్పించాలని కోరింది. తదుపరి విచారణను మే 16కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని