Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్‌

అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పంజాబ్‌ ప్రభుత్వం చేపట్టిన గాలింపును ఆ రాష్ట్రంలోని అకాలీదళ్‌ పార్టీ తప్పుపట్టింది.  

Published : 23 Mar 2023 01:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల పంజాబ్‌(Punjab)లో ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh)కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన వేటను అక్కడి విపక్ష పార్టీ అకాలీదళ్‌ తప్పుపట్టింది. ఆప్‌ ప్రభుత్వం చేపట్టిన చట్టవిరుద్ధమైన ఈ ఆపరేషన్లో అరెస్టైన  పంజాబీ యువతకు తాము న్యాయసాయం అందజేస్తామని అకాలీద్‌ నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ట్విటర్లో పేర్కొన్నారు. సిక్కుల ఆధ్యాత్మిక నాయకులతో ఏర్పాటైన కమిటీ ఈ మేరకు ఓ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను కూడా విడుదల చేసింది. 

‘‘తాజాగా జరిగిన చట్టవిరుద్ధమైన ఆపరేషన్‌లో అరెస్టైన సిక్కుయువతకు అవసరమైన న్యాయసహాయాన్ని అకాలీదళ్‌ అందజేయాలని నిర్ణయించింది. ఆప్‌ ప్రభుత్వం వారి హక్కులను అణగదొక్కకుండా చూసుకోవాలి. సమాఖ్య స్ఫూర్తికి లోబడి సిక్కుల హక్కుల పరిరక్షణకు , రాష్ట్రాలకు మరిన్ని హక్కులు ఇవ్వలన్న డిమాండ్‌ పక్షాన అకాలీదళ్‌ నిలుస్తుంది’’ అని సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ పేర్కొన్నారు. ఈ అరెస్టుల ద్వారా  సిక్కుల ప్రతిష్ఠను దెబ్బతీయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ చూస్తోందని ఆరోపించారు. 

పంజాబ్‌లో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించిన ఆప్‌ కీలుబొమ్మ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నట్లు బాదల్‌ పేర్కొన్నారు. ఎన్నికల్లో లబ్ధికోసం దేశభక్తులైన సిక్కుల ప్రతిష్ఠను దెబ్బతీయవద్దని తాము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు ప్రకటించారు. 

అమృత్‌పాల్‌ కోసం శనివారం పంజాబ్‌ పోలీసులు పక్కా వ్యూహంతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినప్పటికీ అతడు తప్పించుకున్న విషయం తెలిసిందే. పోలీసులు వచ్చినట్లు సమాచారం అందగానే తాను ప్రయాణిస్తున్న మెర్సిడెస్‌ వాహనాన్ని అమృత్‌పాల్‌ అక్కడే వదిలేసి బ్రెజా కారులో వేరే మార్గంలో ఉడాయించాడు. అతడు పరారైన దృశ్యాలు జలంధర్‌లోని టోల్‌ప్లాజా వద్ద రికార్డయ్యాయి. అమృత్‌పాల్‌ పరారయ్యేందుకు సహకరించిన నలుగురిని పంజాబ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని