వైద్యులకే ‘భారతరత్న’ ఇవ్వాలి: కేజ్రీవాల్‌

కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి సమయంలో తమ జీవితాలను, కుటుంబాలను పక్కన పెట్టి వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు సేవలందించారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. వారి సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత...

Updated : 04 Jul 2021 18:59 IST

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి సమయంలో తమ జీవితాలను, కుటుంబాలను పక్కన పెట్టి వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు సేవలందించారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. వారి సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ఈసారి వైద్యులకే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ పురస్కారం కొవిడ్‌ సమయంలో విశేష సేవలందించిన వారందరికీ దక్కాలనీ, అవసరమైతే నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రధానికి సూచించారు.

‘‘ఈ ఏడాది భారతరత్న పురస్కారాన్ని వైద్యులకు ఇవ్వాలని యావత్‌ దేశం కోరుకుంటోంది. అయితే ఫలానా వ్యక్తికి ఇవ్వాలని నేను చెప్పను. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది ఇలా అందరికీ ఈ గౌరవం దక్కాలి’’ అని కేజ్రీవాల్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇలా గౌరవించినప్పుడే కొవిడ్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నిజమైన నివాళులర్పించినట్లవుతుందని ఆయన అన్నారు.

‘‘లక్షల మంది వైద్యులు, నర్సులు తమ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. వాళ్లందరికీ కేవలం కృతజ్ఞతలు చెప్పేస్తే సరిపోతుందా? ఓ వ్యక్తికి కాకుండా..బృందానికి భారతరత్న ఇచ్చేందుకు నిబంధనలు అడ్డమైతే.. అందులో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. దేశమంతా వైద్యులకు రుణపడి ఉంది. వారికి భారతరత్న ఇచ్చి సత్కరిస్తే యావత్‌దేశం సంతోషిస్తుంది’’ అని కేజ్రీవాల్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం రెండోదశ వ్యాప్తిలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 789 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. అందులో కేవలం దిల్లీలోనే 128 మంది మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని