Kejriwal: పాఠశాలల దుస్థితి మార్చకుంటే.. గుజరాత్‌ నుంచి తరిమేయండి..!

మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న గుజరాత్‌లో పాగా వేసేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ సిద్ధమవుతోంది.

Published : 02 May 2022 01:51 IST

గుజరాత్‌లో దిల్లీ మోడల్‌ తెస్తామన్న అరవింద్‌ కేజ్రీవాల్‌

గాంధీనగర్‌: మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న గుజరాత్‌లో పాగా వేసేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకోసం గుజరాత్‌లో విస్తృత ప్రచారం నిర్వహిస్తోన్న అరవింద్‌ కేజ్రీవాల్‌.. రాష్ట్రంలో పాఠశాలల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్థితికి భాజపా కారణమన్న ఆయన.. పేపర్‌ లీకేజీ లేకుండా ఏఒక్క పరీక్ష నిర్వహించలేకపోతున్నారని మండిపడ్డారు. ఇలా అధ్వాన స్థితిలో ఉన్న  గుజరాత్‌లో వ్యవస్థలను మార్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అలా చేయడంలో తాము విఫలమైతే రాష్ట్రం నుంచి వెళ్లగొట్టండి అంటూ గుజరాత్‌ ప్రజలను అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరారు.

‘గుజరాత్‌లో 6వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. మరిన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో లక్షల మంది చిన్నారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దిల్లీలో పాఠశాలలను మార్చినట్లుగా గుజరాత్‌లోనూ వాటిని పూర్తిగా మారుస్తాం’ అని భరూచ్‌లో పర్యటనలో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దిల్లీలో 4లక్ష మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక దిల్లీలో మాదిరిగా మోహల్లా క్లినిక్‌లతో ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తామన్న ఆయన.. దేశంలో ఎక్కడాలేని విధమైన కరెంటు ధరలు గుజరాత్‌లో ఉన్నాయన్నారు.

ఇక పరీక్ష పేపర్‌ లీకేజీలపై మండిపడ్డ అరవింద్‌ కేజ్రీవాల్‌.. పరీక్షల పేపర్‌ లీకేజీల్లో గుజరాత్‌ ప్రపంచ రికార్డు సాధించిందన్నారు. ఈ సందర్భంగా పేపర్‌ లీకేజీ లేకుండా కనీసం ఒక్క పరీక్షైనా నిర్వహించగలరా ?అంటూ గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్య, వైద్య పరిస్థితులను మార్చడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని, ఒకవేళ తాము అలా చేయలేకపోతే రాష్ట్రం నుంచి తరిమేయవచ్చన్నారు.

ఇదిలాఉంటే, దిల్లీ మోడల్‌ పేరుతో పలు రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోన్న ఆమ్‌ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన పంజాబ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. అదే ఉత్సాహంతో ఉన్న ఆప్‌.. మరికొన్ని నెలల్లోనే జరగబోయే గుజరాత్‌ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లను సొంతం చేసుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ యాభైకిపైగా సీట్లలో గెలువబోతున్నట్లు ఇటీవల జరిపిన ఓ సర్వేలో వెల్లడైనట్లు ఆమ్‌ఆద్మీ చెప్పుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని