Delhi: రూపాయి విలువ తగ్గడం కాదు.. డాలర్‌ బలపడుతోంది : నిర్మలా సీతారామన్‌

రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోవడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మరోసారి స్పందించారు. ఫ్రస్తుతం డాలర్‌ విలువ బలపడుతున్నందున రూపాయి విలువ తగ్గుముఖం పట్టిందని ఆమె వివరించారు.

Published : 16 Oct 2022 18:37 IST

దిల్లీ: రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోవడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మరోసారి స్పందించారు. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే రూపాయి విలువ ఆశాజనకంగానే ఉన్నట్లు చెప్పారు. రూపాయి విలువ మరింత తగ్గిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం డాలర్‌ విలువ బలపడుతున్నందున రూపాయి విలువ తగ్గుముఖం పట్టిందని ఆమె వివరించారు. అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన ఆమె.. దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూపాయి స్థిరత్వం కోల్పోకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

అంతర్జాతీయంగా క్రయ విక్రయాలన్ని దాదాపు అమెరికన్‌ డాలర్లతో ముడిపడి ఉంటాయని, అందువల్ల డాలర్‌ విలువ పెరిగితే దాని ప్రభావం అన్ని దేశాల కరెన్సీలపైనా పడుతుందని సీతారామన్‌ వివరించారు. ప్రస్తుతం డాలర్‌ విలువ క్రమంగా పెరుగుతున్నందువల్ల రూపాయి విలువ తగ్గినట్లనిపిస్తోందని వివరించారు. ‘‘రూపాయి అస్థిరతను తగ్గించేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేపడుతోంది. అలాగని మార్కెట్‌లో జోక్యం చేసుకోకూదు. రూపాయి విలువ మరీ పతనం కాకుండా చూసుకోగలినట్లయితే తిరిగి పుంజుకోవడం ఖాయం.’’ అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలోనే కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు ఏర్పడినట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.69 జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని