ఆక్స్‌ఫర్డ్‌ టీకా: చిన్నారులపై ప్రయోగాలు నిలిపివేత!

కరోనా వ్యాక్సిన్‌పై చిన్నారుల్లో జరుగుతోన్న క్లినికల్‌ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.

Published : 07 Apr 2021 16:54 IST

తాత్కాలికంగానే అని వెల్లడించిన ఆస్ట్రాజెనెకా

లండన్‌: కరోనా వ్యాక్సిన్‌పై చిన్నారులపై జరుగుతోన్న క్లినికల్‌ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. పలు దేశాల్లో టీకా తీసుకున్న పెద్దవారిలో రక్తం గడ్డ కడుతున్నట్లు ఫిర్యాదులు వస్తోన్న నేపథ్యంలో.. వాటికి సంబంధించి పూర్తి విశ్లేషణ సమాచారం వచ్చే వరకూ చిన్నారులపై ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లలో ఎక్కువగా 18ఏళ్ల వయసు పైబడిన వారిపైనే ప్రయోగాలు చేయడంతో.. ప్రస్తుతం వారికి మాత్రమే వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తున్నారు. ఈ సమయంలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు తీసుకొచ్చేందుకు ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా 6నుంచి 17ఏళ్ల వయసుగల 300 మంది చిన్నారుపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేపడుతున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించింది. ఇప్పటికే కొందరికి వ్యాక్సిన్‌ డోసు ఇచ్చినట్లు సమాచారం.

ఇదే సమయంలో యూరప్‌ దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కడుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. ఇలా ఇప్పటివరకు 30మందికి బ్లడ్ క్లాట్‌ అయినట్లు గుర్తించగా..వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. దీంతో పలు దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పంపిణీపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే, రక్తం గడ్డకట్టడానికి వ్యాక్సిన్‌ కారణమని చెప్పడానికి ఎలాంటి రుజువులు లభించలేదని బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ కోణంలో నిపుణులు సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రక్తం గడ్డకట్టడంపై పూర్తి సమాచారం వచ్చే వరకు చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిలిపివేస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకాలు ప్రకటించాయి.

ఇదిలాఉంటే, బ్రిటన్‌లో ఇప్పటివరకు కోటి 80లక్షల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. వీరిలో అతికొద్ది మందిలోనే బ్లడ్‌క్లాట్‌ వంటి దుష్ప్రభావాలు వెలుగు చూస్తున్నట్లు అక్కడి నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్లే రక్తం గడ్డకట్టడానికి ఎలాంటి సంబంధం లేదని బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాటిపై పూర్తి నివేదిక వచ్చేవరకు ముందుజాగ్రత్త చర్యగా.. చిన్నారుల్లో వ్యాక్సిన్‌ ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని