Covid:కరోనా పాజిటివ్‌ వస్తే ఏడు రోజులు వేతనంతో కూడిన సెలవు.. ఆదేశించిన సీఎం

ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 8,334 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం యూపీలో 33,946 క్రియశీల కేసులుండగా..33,563 మంది హోం ఐసోలేషన్‌లో

Published : 11 Jan 2022 20:29 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 8,334 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం యూపీలో 33,946 క్రియశీల కేసులుండగా..33,563 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే, మరికొన్ని రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టడానికి యోగీ ఆదిత్యనాథ్ సర్కారు పలు చర్యలకు ఉపక్రమించింది. 

ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలలో అత్యవసర సేవల విభాగాలు మినహా ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు. వర్క్‌ఫ్రమ్ హోంని ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేట్‌ కార్యాలయాల్లో పనిచేసేవారికి కరోనా పాజిటివ్‌గా తేలితే వారికి ఏడు రోజులపాటు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని కార్యాలయాల్లో కొవిడ్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని, స్క్రీనింగ్ లేకుండా ఎవరికీ ప్రవేశం కల్పించవద్దని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో రోగుల తాకిడిని తగ్గించడానికి వీలైనంత వరకు ఆన్‌లైన్‌, టెలిఫోన్‌ ద్వారా రోగులను సంప్రదించాలని, అత్యవసరమైతేనే ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసే దిశగా పనిచేయాలని సీఎం ఆదేశించారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రతి ఒక్కరికీ 10 రోజుల ముందుగానే టీకాలు వేయించాలని, ఇందుకోసం తక్షణమే ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని