Chandrayaan 3 : చందమామ అందిన రోజు.. ఇకపై ‘నేషనల్ స్పేస్ డే’!

జాబిల్లిపై దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్‌-3 (Chandrayaan 3) సురక్షితంగా ల్యాండ్‌ అయిన రోజు ఆగస్టు 23ను కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ స్పేస్‌  డే’గా (National Space Day) ప్రకటించింది.

Published : 29 Aug 2023 18:17 IST

దిల్లీ : చంద్రయాన్‌-3 (Chandrayaan 3) జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని ముద్దాడిన ఆగస్టు 23ను కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ స్పేస్‌  డే’గా (National Space Day) ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ‘చంద్రయాన్‌-3 సాధించిన ఘనత పట్ల యావత్‌ దేశం, కేంద్ర కేబినెట్‌ సంతోషం వ్యక్తం చేస్తోంది. మన దేశ శాస్త్రవేత్తలు సాధించిన ఈ చారిత్రక విజాయానికి తగిన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం భావించింది. అందుకే ఆగస్టు 23ను ‘నేషనల్‌ స్పేస్‌ డే’ జరుపుకోవడానికి ఆమోదం తెలిపింది. అత్యద్భుతమైన ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను మంత్రివర్గం అభినందిస్తోందని’ ఆయన పేర్కొన్నారు. 

ఆ ఆత్మహత్యలు నన్ను ఎంతగానో కలచివేశాయి: ‘సూపర్ 30’ ఆనంద్‌ కుమార్‌

మన శాస్త్రవేత్తలు చేసిన నిరంతర ప్రయోగాల కృషి ఫలితంగానే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ అవతరించిందని అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. విజ్ఞానాన్ని శోధించడానికి భారతీయ శాస్త్రవేత్తలు ఎలాంటి అడ్డంకులనైనా అధిగమిస్తారనేదానికి ఇదొక సంకేతమన్నారు. ప్రజ్ఞాన్‌ రోవర్‌ నుంచి ఏ సమాచారం అందినా అది అంతరిక్ష అభివృద్ధిలో కొత్త మార్గాల అన్వేషణకు దోహదపడుతుందని చెప్పారు. చంద్రుడి రహస్యాలను, అంతకుమించి లోతైన విషయాలను అవగాహన చేసుకోవడానికి వీలు కలుగుతుందని తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో మహిళలు భాగస్వాములు కావడం పట్ల అనురాగ్‌ ఠాకూర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ నెల 23న భారత రోదసి చరిత్రలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశమూ అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్‌-3 వ్యోమనౌకను సురక్షితంగా దించి.. వినువీధిలో భారత పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను ఆనందంతోనూ.. ఒకింత విజయగర్వంతోనూ నింపింది. విక్రమ్‌ ల్యాండ్‌ అయిన తర్వాత దాదాపు నాలుగు గంటలకు దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ సాఫీగా బయటికొచ్చింది. అప్పటి నుంచి చంద్రుడి ఉపరితలంపై కీలక పరిశోధనలు సాగుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని